హైదరాబాద్: దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా ఉన్న మత అసహనంపై సుప్రీంకోర్ట్ ఛీఫ్ జస్టిస్‌గా ఇటీవల పదవీబాధ్యతలు చేపట్టిన టీఎస్ ఠాకూర్ ఇవాళ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారేటట్లున్నాయి. ఏ మతం పట్లా దేశంలో అసహనం లేదని ఠాకూర్ అన్నారు. ఇవాళ కొందరు జర్నలిస్టులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అన్ని వర్గాల వారికీ, మతాలవారికీ భద్రత, రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. న్యాయవ్యవస్థ స్వతంత్రంగా ఉన్నంతకాలం ఏ వర్గం పట్లా అసహనం ఉండదని, అన్ని వర్గాల ప్రయోజనాలనూ కాపాడతామని అన్నారు. మత అసహనంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చలో కొన్ని రాజకీయాలు ఇమిడి ఉన్నాయని, దానిలో తాను భాగం కావాలనుకోవటం లేదని చెప్పారు. అయితే, న్యాయవ్యవస్థ ఉన్నంతకాలం ఏ పౌరుడూ అసహనానికి గురవటంకానీ, బహిష్కరణకు గురవటంగానీ జరగదని అన్నారు. ఏ పౌరుడూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. సహనం అనేది భారత దేశం యొక్క మౌలిక లక్షణమని, వేర్వేరు సంస్కృతులు, మతాలకు చెందిన వారు ఇక్కడకు వచ్చి, స్థిరపడి, ఇక్కడే అభివృద్ధి చెందారని గుర్తు చేశారు.