తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికలకి కాంగ్రెస్, తెదేపా, బీజేపీల కంటే ముందు అధికార తెరాస తన అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. తెరాస సెక్రటరీ జనరల్ కె.కేశవ్ రావు మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలలో 7 స్థానాలకు తమ పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటించారు. వారిలో లక్ష్మినారాయణ- ఖమ్మం, పి. సతీష్-అదిలాబాద్, ఎన్.లక్షణ రావు మరియు భాను ప్రసాద్-కరీంనగర్, ఆర్.భూపతి రెడ్డి-నిజామాబాద్, టి. చిన్నప్ప రెడ్డి-నల్గొండ, భూపాల్ రెడ్డి-మెదక్ నుండి పోటీ చేస్తారు. వరంగల్,రంగారెడ్డి,మహబూబ్ నగర్ లనుండి పోటీ చేయబోయే మిగిలిన ఐదుగురు అభ్యర్ధుల పేర్లను కూడా ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామని కేశవ్ రావు తెలిపారు.
మొత్తం 12 స్థానాలలో తెరాస అభ్యర్ధులను గెలిపించుకోగలిగినంత బలం తమ పార్టీకి ఉన్నందునే అభ్యర్ధులను నిలబెడుతున్నాము తప్ప ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ఇతర పార్టీల నేతలను పార్టీలోకి ఆకర్షించి వారి అండ చూసుకొని అభ్యర్ధులను నిలబెట్టడం లేదని తెలిపారు. తమ అభ్యర్ధులను గెలిపించుకోవడానికి ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేయవలసిన దుస్థితిలో తమ పార్టీ లేదని అన్నారు. దానం నాగేందర్ తెరాసలో చేరే విషయం గురించి తనకు తెలియదని కేశవ్ రావు అన్నారు.