ఇంతవరకు భారతదేశంలో చాలా సార్లు ఉగ్రవాదులు దాడులు చేసారు. వాటిలో సామాన్య ప్రజలనే లక్ష్యంగా చేసుకొని దాడులు చేసేవారు. 2001లో పార్లమెంటుని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసారు. కానీ ఉగ్రవాదుల దాడిని మన భద్రతాదళాలు నిలువరించగలిగాయి. ఈసారి లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులు భారత ప్రధాని నరేంద్ర మోడిని లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడాలని పధకాలు సిద్దం చేసుకొన్నట్లు నిఘా వర్గాలు కనిపెట్టగలిగాయి. దాని కోసం నలుగురు లష్కర్ ఉగ్రవాదులు నెల రోజుల క్రిందట దేశంలోకి జొరబడగా, వారిలో ఇద్దరినీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పోలీసులు అరెస్ట్ చేసారు. వారందించిన సమాచారం ప్రకారం ప్రధాని నరేంద్ర మోడి పాల్గొనే ఏదయినా బహిరంగ సభలో ఆయనని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడులు జరపడం, లేకుంటే అదే సభలో వీలయినంత ఎక్కువ ప్రాణ నష్టం కలిగించడం, ఒకవేళ ఈ రెండు పనులు సాధ్యం కానట్లయితే డిల్లీలోని ప్రముఖులను లేదా ప్రాముఖ్యత కలిగిన భవనాలు, ప్రదేశాలలో ప్రేలుళ్లకు పాల్పడాలని లష్కర్ ఉగ్రవాదులు నిశ్చయించుకొన్నట్లు విచారణలో తెలిసింది. ఈ దాడులను అమలు చేసే బాధ్యత లష్కర్ కమాండర్ గా నియమితుడయిన ‘దుజన’ అనే ఉగ్రవాదికి అప్పగించినట్లు తెలిసింది.
నిఘా వర్గాలు, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ బృందం కలిసి జమ్మూలో బటింది అనే ప్రాంతంలో నివసిస్తున్న అమీర్ ఆలం గుజ్జర్ అనే వ్యక్తి ఇంట్లో దాగి ఉన్న షబ్బీర్ అహ్మద్ మాలిక్ అనే లష్కర్ ఉగ్రవాదిని నవంబర్ 20వ తేదీన అరెస్ట్ చేసారు. తీగ లాగితే డొంక కదిలినట్లు అతని ద్వారా లష్కర్ పన్నిన ఈ కుట్ర గురించి తెలుసుకోగలిగారు. ముంబై దాడులు తరహాలో డిల్లీలో కూడా దాడులు జరిపేందుకు డిల్లీలో రెక్కి నిర్వహించడానికి షబ్బీర్ అహ్మద్ మాలిక్ కి రూ.47, 000 ముట్టినట్లు కనుగొన్నారు.
లష్కర్, ఐసిస్ ఉగ్రవాదులకు భారత్ లో కొందరు వ్యక్తులు సహకరిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. వారి అనుమానాలను నిజం చేస్తూ జమ్మూలోని సరిహద్దు భద్రతాదళం నిఘా విభాగంలో హెడ్ కానిస్టేబుల్ పనిచేస్తున్న అబ్దుల్ రషీద్ అనే వ్యక్తి, భద్రతాదళాల గురించి అత్యంత రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ కి అందజేస్తున్నట్లు కనుగొని కొన్ని రోజుల క్రితమే జమ్మూలో అరెస్ట్ చేసారు. భరత్ లోకి ప్రవేశించిన నలుగురిలో మరో ఇద్దరి గురించి పోలీస్ మరియు నిఘా వర్గాలు వెతుకుతున్నాయి. కానీ వారిద్దరూ పట్టుబడేలోగానే ఎక్కడయినా ప్రేలుళ్ళకు పాల్పడే ప్రమాదం ఉంది. కనుక దేశ ప్రజలందరూ అప్రమత్తంగా మెలగవలసిన అవసరం ఉంది.