హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా విషయంలో గత నాలుగైదు రోజులుగా గోడమీద పిల్లిలాగా డ్యాన్స్‌లు చేసిన దానం నాగేందర్ ఎట్టకేలకు ఒక నిర్ణయానికొచ్చారు. టీఆర్ఎస్లో చేరమని తనను అడిగిన మాట వాస్తవమేనని, కానీ కాంగ్రెస్ పార్టీని వీడబోనని ఇవాళ ఉదయం స్పష్టంగా చెప్పారు. పార్టీ మారతానంటూ పదే పదే తనను బాధపెట్టొద్దని, ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. పార్టీనుంచి పొమ్మనలేక పొగబెట్టిన మాట నిజమేనని అన్నారు. ఈ ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఇంట్లో ఇతర నేతలతో చర్చల తర్వాత దానం విలేకరులతో మాట్లాడారు. చేతులు జోడించి చెబుతున్నానని, కాంగ్రెస్‌ను వీడనని అన్నారు. పార్టీ బలోపేతంకోసం కృషి చేస్తానని, జీహెచ్ఎంసీ ఎన్నికలపై రేపు సమావేశం అవుతున్నట్లు చెప్పారు. రేపటి సమావేశంలో చర్చించాల్సిన అంశాల కోసమే షబ్బీర్ ఇంట్లో భేటీ అయ్యామని అన్నారు. ఎన్నికల వ్యూహాన్ని రేపు ఖరారు చేస్తామని చెప్పారు.
టీఆర్ఎస్లో చేరే విషయంలో ఆ పార్టీ నాయకత్వానికి, దానం నాగేందర్‌కు పొసగక పోవటమే దానం తాజా నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు. దానం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరదామని అనుకుంటే, కేసీఆర్ మాత్రం కేశవరావు సమక్షంలో చేరమని అన్నారట. దీనితో ఖిన్నుడైన దానం తన నిర్ణయాన్ని మార్చుకున్నారని చెబుతున్నారు.