ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఈనెల 17వ తేదీ నుండి 22 వరకు హైదరాబాద్ లో జరుగుతాయని స్పీకర్ డా. కోడెల శివ ప్రసాద రావు కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. త్వరలో తెదేపా, వైకాపా, బీజేపీలతో సమావేశం నిర్వహించి శాసనసభ షెడ్యూల్ పై వారి అభిప్రాయం కూడా తీసుకొంటారు. శాసనసభ సమావేశాల కోసం ఆయన తుళ్ళూరులో తాత్కాలిక భవనాలను నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కానీ దాని వలన ప్రజాధనం వృధా అవడం అందుకు అందరి నుండి విమర్శలు ఎదుర్కోవలసి రావడం తప్ప మరే ప్రయోజనం ఉండదనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలుపలేదు. ప్రతీసారి శాసనసభ సమావేశాలను వైజాగ్ లేదా విజయవాడలో నిర్వహిస్తామని చెపుతూ, దాని కోసం కమిటీలు వేయడం, ఆ కమిటీలు అన్ని చోట్లా తిరిగి అధ్యయనం చేసి శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి అనువుగా ఉన్నాయని నివేదికలు ఇవ్వడం జరుగుతోంది. ఆ తరువాత అనేక కారణాల చేత సమావేశాలు మళ్ళీ హైదరాబాద్ లోనే నిర్వహించడం జరుగుతోంది. ఉద్యోగులందరినీ విజయవాడ తరలిరావాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నపుడు, ముందు శాసనసభ సమావేశాలను విజయవాడలో నిర్వహించి ఉంటే, వారికీ నమ్మకం కలిగించినట్లు ఉండేది. రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు నిర్వహించడానికే తగిన సౌకర్యం లేనప్పుడు ఒకేసారి వేలాదిమంది ఉద్యోగులు, కార్యాలయాలు తరలి వస్తే సదుపాయం కల్పించడం సాధ్యమేనా?మంత్రులు, ప్రజా ప్రతినిధుల సౌకర్యం కోసం శాసనసభ సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. కానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించకుండానే ఉద్యోగులను విజయవాడకు తరలిరమ్మని ఒత్తిడి చేయడం సమంజసమేనా? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు విజయవాడ తరలివచ్చేక, మళ్ళీ వచ్చే శాసనసభ సమావేశాలను హైదరాబాద్ లోనే నిర్వహిస్తే అప్పుడు వాటి కోసం సంబంధిత ఉద్యోగులు అందరూ మళ్ళీ హైదరాబాద్ తరలివెళ్ళవలసి ఉంటుంది కదా? ఇప్పటికి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి ఏడాదిన్నర కాలం గడిచిపోయింది. నేటికీ ఉద్యోగుల తరలింపు, శాసనసభ సమావేశాల నిర్వహణపై ఇంకా సందిగ్దత కొనసాగూతూనే ఉంది. ఇది ఇంకా ఎంత కాలం కొనసాగుతుందో, ఇంకా ఎప్పటికి పరిపాలన గాడిన పడుతుందో తెలియడం లేదు.