హైదరాబాద్: నిన్న హైదరాబాద్లో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి ఈ నెల 23 నుంచి 27 వరకు జరిగే ఆయుత చండీయాగానికి వ్యక్తిగతంగా ఆహ్వానిస్తారని ఉదయం మీడియాకు సమాచారం లీక్ అయింది. అయితే ఏమయిందో ఏమో కానీ కేసీఆర్ బాబు ఇంటికి వెళ్ళనూ లేదు… ఆహ్వానించనూ లేదు. చంద్రబాబు ప్రస్తుతం విజయవాడలోనే ఎక్కువగా ఉంటున్నందున ఆహ్వానించటానికి అక్కడకే వెళ్ళి ఆహ్వానించటం సముచితమనే ఉద్దేశ్యంతో కేసీఆర్ ఈ భేటీని వాయిదా వేసుకున్నారని ఒక వాదన వినిపిస్తున్నప్పటికీ రాజకీయ పరంగా ఇరు పార్టీలలోని నాయకులూ మరో కారణం చెబుతున్నారు. నిన్నటి భేటీ రద్దుకు కారణం జీహెచ్ఎంసీ ఎన్నికలని ఇరు పార్టీలలోనూ ఒక వాదన వినిపిస్తోంది. హైదరాబాద్లో చంద్రబాబును కలవటం రాబోయే ఎన్నికలలో ప్రతికూల ఫలితాలనిస్తుందని టీఆర్ఎస్ నాయకులు భావించటం వల్లనే కేసీఆర్ ఈ సమావేశాన్ని వాయిదా వేసుకున్నారని ఆ పార్టీలోని నాయకులు చెబుతున్నారు. టీడీపీ అనేది ఆంధ్రా పార్టీ అని, అది తెలంగాణకు మేలు చేయాలని ఒక్కనాటికీ అనుకోదని వారు వాదిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. మరోవైపు, ఆయుత చండీయాగానికి హాజరు కావద్దని చంద్రబాబుకు తాము చెప్పామని టీడీపీ తెలంగాణ నాయకులు అంటున్నారు. టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ జిత్తులమారి రాజకీయం చేస్తున్నారని, పాకిస్తాన్ తరహాలో ఒకవైపు స్నేహ హస్తం చాస్తూనే, మరోవైపు తెలుగుదేశాన్ని తెలంగాణలో అంతమొందించటానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లో సీమాంధ్ర ఓటర్లు 30 శాతం ఉన్నందున, జీహెచ్ఎంసీ ఎన్నికలపై ధీమాగా ఉన్న టీడీపీ నాయకులు, చంద్రబాబును ఈ ఎన్నికలు ముగిసే వరకు తరచూ హైదరాబాద్ వచ్చి పోతుండాలని కోరుతున్నారు. మరి బాబుకు కేసీఆర్ ఆహ్వానం ఎప్పుడో, ఆ యాగానికి బాబు హాజరు ఎప్పుడో తెలియాలంటే ఇంకొంతకాలం ఆగాల్సిందే.