విజయవాడలో పనిప్రారంభమైన కనకదుర్గ ఫ్లయ్ ఓవర్ నిర్మాణం క్లిష్టతరమైందని ఇంజనీర్లు చెబుతున్నారు. ఒక పక్క ప్రకాశం బ్యారేజి, మరో పక్క దుర్గగుడి కొండ, కృష్ణానదిలో (ఫ్లయ్ ఓవర్ ప్రాంతంలో) నిరంతరం 12 అడుగులలోతున నీరు…ఒక నిర్మాణంలో మూడు ఫ్యాక్టర్లను పరిగణనలోకి తీసుకుని ఇంజనీరింగ్ డిజైన్ ను రూపొందించకోవలసిన సిట్యుయేషన్ ప్రపంచంలోనే అరుదైనదిగా చెప్ప వచ్చు అని ఒక ఇంజనీర్ వివరించారు.
ఇంత క్లిష్టమైన ప్రాజెక్టును ఏడు నెలల్లో పూర్తి చేసేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. అధునాతన టెక్నాలజీ నుంచి వచ్చిన కన్ స్ట్రక్షన్ యంత్రాలు పరికరాలను ఇందుకు ఉపయోగిస్తారు. హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణం తీరు తెన్నులు ఇన్ ఫ్రాక్చర్ బిల్డర్ల అవగాహనలో, దృక్పధాల్లో పెద్దమార్పు తెచ్చింది.
447 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న కనకదుర్గ ఫ్లయ్ ఓవర్ నిర్మాణానికి ప్రజలు ఇచ్చిన సహకారం అపూర్వమే అంటున్నారు. ఈ ఫ్లైఓవర్‌ను కృష్ణా పుష్కరాల్లోపు వినియోగంలోకి తీసుకు వచ్చేలా ప్లాన్ రూపొందించారు. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన భూ సేకరణకు ప్రజలు సహకరించడం వల్లే వేగంగా నిర్మాణ పనులు చేయగలుగుతున్నారు. 25 రోజుల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఇళ్లు, తాగునీటి పైప్లైన్లు, విద్యుత్ టవర్ల మార్పు వంటి పనులు విజయవంతంగా పూర్తి చేశారు.
ఇలా వుండగా రాజధాని ప్రాంతంలో కీలకంగా ఉన్న విజయవాడ నగరాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా 24 గంటలూ తాగునీరు సరఫరా చేయాలనుకుంటున్నారు. మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగు పరిచేందుకు కేంద్రం మంజూరు చేసిన రూ.480 కోట్లతో డ్రెయిన్ల నిర్మాణ పనులను త్వరలోనే చేపట్టడతారు.
రాజధాని అమరావతి, విజయవాడ ఔటర్ రింగ్‌రోడ్డుకు ఇతర ప్రతిపాదనలను నెల రోజుల్లో సమగ్ర నివేదిక (డిపిఆర్)ను పంపుతామని, నిధులు విడుదలకు ప్రొసెస్ ఛార్టును రూపొందించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.
జాతీయ రహదారుల ప్రాథికార సంస్థ, రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రూ.447.88 కోట్ల నిధులతో దుర్గ గుడి వద్ద ఆరు వరుసల ఫ్లైఓవర్ నిర్మాణం, జాతీయ రహదారి 65 నుంచి 16 వరకు (దుర్గగుడి వద్ద నుంచి వారధి వరకు) 5 కిలోమీటర్ల నాలుగు వరుసల రహదారి విస్తరణ, రూ.314.43 కోట్లతో ఇబ్రహీంపట్నం సెంటర్ నుంచి చంద్రగూడెం వరకు 32 కిలోమీటర్ల వరకు ఎన్‌హెచ్ 30 రెండు వరుసల పేవ్డ్ షోల్డర్ పునర్నిర్మాణం, స్థాయి పెంపు, ఎన్‌హెచ్ 216 నాలుగు వరుసల పేవ్డ్ షోల్డర్ పునర్నిర్మాణం, పనులకు నితిన్ గడ్కరి పునాదిరాళ్ళు వేశారు. రూ.1462.32 కోట్ల నిధులతో ఎన్‌హెచ్ 65 విజయవాడ నుంచి మచిలీపట్నం నాలుగు వరుసల రహదారి, బెంజిసర్కిల్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు బెంజిసర్కిల్ ఆంజనేయస్వామి ఆలయం వద్ద శంకుస్థాపన చేశారు.
ఈ నిర్మాణాల సమయంలో ట్రాఫిక్ కు తీవ్రమైన అసౌకర్యం ఏర్పడినా, దుమ్మూ ధూళి శబ్దాలు ప్రజా జీవనాన్ని ఇబ్బంది పెట్టినా నిర్మాణాలు పూర్తయ్యాక ఈ కష్టాలన్నీ మరచిపోయేటంత అందమైన , సౌకర్యవంతమైన డిజైన్లను రూపొందిస్తున్నారు.