చెన్నైలో ఇటీవల కురిసిన బారీ వర్షాలతో నగరంలో జనజీవనం అస్తవ్యస్తం అవడంతో సహాయ చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయిందని, తమవంటి వారు విరాళాలు ఇవ్వవలసిన పరిస్థితి చూస్తుంటే ప్రజలు కట్టిన పన్నులు ఏమవుతున్నాయో తెలియడం లేదని నటుడు కమల్ హాసన్ అన్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చేయి. తమిళనాడు ఆర్ధికమంత్రి పన్నీర్ సెల్వం, అధికార అన్నాడి.ఎం.కె. నేతలు కమల్ హాసన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేసారు. దానికి కమల్ హాసన్ మళ్ళీ నేడు వివరణ ఇచ్చుకొన్నారు.
“నేను నా మిత్రుడు ఒకరికి వ్రాసిన లేఖలో చెన్నై పరిస్థితి గురించి ఆవేదన వ్యక్తం చేసాను తప్ప ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు నేను అనలేదు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని నేను అనలేదు. నా లేఖలో కొంత భాగం మాత్రమే మీడియాలో ప్రచురితమయింది. అది కూడా వక్రీకరించబడింది. నేను నా ఆవేదన వ్యక్తం చేసానే తప్ప ఎవరినీ తప్పు పట్టలేదు. ఒకవేళ నా లేఖ వలన ఎవరికయినా బాధ కలిగించినట్లయితే అందుకు క్షమాపణలు తెలుపుతున్నాను. నేను మౌనంగా ఉంటే వాస్తవాలు బయటకి వస్తాయనుకొన్నాను. ఇప్పుడు నేను ఇస్తున్న ఈ వివరణ కూడా పన్నీర్ సెల్వంకి జవాబుగా ఇస్తున్నది కాదు. నా మౌనం వలన నా అభిమాన సంఘాలలో అయోమయం ఏర్పడకూడదనే ఉద్దేశ్యంతోనే జవాబిస్తున్నాను. అయినా ఇది వాదోపవాదాలకు, విమర్శలు, ప్రతివిమర్షలకు సమయం కాదు. అందరం కలిసి చెన్నైని మళ్ళీ చక్కబెట్టుకోవలసిన సమయం ఇది. నా అభిమానులు, నన్ను విమర్శించేవాళ్ళు అందరూ కూడా సహాయ చర్యలలో పాల్గొనమని అభ్యర్ధిస్తున్నాను,” అని కమల్ హాసన్ అన్నారు.
తమిళనాడులో ఎవరితోనయినా కయ్యానికి కాలు దువ్వవచ్చును కానీ అధికార అన్నాడి.ఎం.కె.పార్టీని, ముఖ్యమంత్రి జయలలితని, ఆమె ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే సాహసం ఎవరూ చేయరు. కానీ కమల్ హాసన్ చేసారు. వెంటనే వీర అమ్మ భక్త పన్నీర్ సెల్వంతో సహా అధికార అన్నాడి.ఎం.కె. నేతలు ఒకరి తరువాత మరొకరు కమల్ హాసన్ పై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టేసరికి కమల్ హాసన్ చల్లబడిపోయినట్లున్నారు. తన లేఖను మీడియా వక్రీకరించిందని అన్నప్పటికీ “ఎవరికయినా బాధ కలిగించినట్లయితే క్షమాపణలు” చెప్పుకొంటున్నట్లు ప్రకటించేసి ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసారు.