ఫోకస్
`కదల్లేనమ్మకు దూకుడెక్కవ’ – అన్నట్లుంది చెన్నై వరద సంఘటనలో జయలలిత కొనసాగిస్తున్న ప్రచారహోరు. అన్నాడిఎంకె నాయకులు, కార్యకర్తలు హోర్డింగ్స్, స్టిక్కర్లతో కొనసాగిస్తున్న ప్రచార ఆర్భాటానికీ , `అమ్మ’ ప్రత్యక్షంగా వరదబాధితులను ఆదుకుంటున్న తీరుకి మధ్య `హస్తమశకాంతరం’ ఉంది. బెడిసికొడుతున్న ఈ ప్రచారంలో తన ప్రమేయం లేదంటూ జయలలిత తరవాత అడ్డంగా వాదించినా ప్రయోజనం లేదు. ఎందుకంటే, ఇప్పటికే తలకు బొప్పికట్టిన మాట వాస్తవం.
67ఏళ్ల జయలలిత అనారోగ్యంతో సతమతమవుతున్నమాట నిజమే. గతంలోలాగా ఛంగున లేచి ప్రచారానికి వెళ్ళే పరిస్థితి ప్రస్తుతానికి కనబడటంలేదు. చెన్నై వరద బాధితులను పరామర్శించే విషయంలో ఆమె ఎన్నో ప్రాంతాలకు వెళ్లాలని బాధితులను ప్రత్యక్షంగా పరామర్శించి నూటికినూరు మార్కులు కొట్టేయాలని మనసులో అనుకుని ఉండవచ్చు. కానీ ఆరోగ్య పరిస్థితి అందుకు సహకరించడంలేదు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రజలు తీవ్రస్థాయిలో ఇబ్బందులకు గురైనప్పుడు చాలా యాక్టీవ్ గా స్పందించాలని ప్రజలు కోరుకుంటారు. పైగా రాజకీయ కోణంలో చూసినా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు పెట్టుకుని వరద బాధితులను పరోక్షంగా పరామర్శించడం ఆశ్చర్యకరమైన ధోరణే.
ప్రజలకు కష్టాలొచ్చినప్పుడు ఎలా స్పందించాలన్న విషయంలో ఇప్పుడు చెన్నైవాసులు, విశాఖ తుపాను (హుద్ హుద్) సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిన చొరవను గుర్తుచేసుకుంటూ తమ రాష్ట్ర ముఖ్యమంత్రి తీరుని ఎండగడుతున్నారు. వయసు తెస్తున్న ఇబ్బందులతోపాటుగా, ఈమధ్య `లెక్కకు మించిన ఆస్తుల కేసు’లో జైలుకు వెళ్లాల్సిరావడం, ఇతర రాజకీయ సమస్యల కారణంగా జయలలిత గతంలోలాగా యాక్టీవ్ గా స్పందిచలేకపోతున్నారన్న విమర్శ వినబడుతోంది. ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు, చెన్నై యావత్తు నీటమునిగినప్పుడు ఆమె నుంచి స్పందన నగరవాసులు ఎక్కువగానే ఆశించారు. మరో రకంగా చెప్పాలంటే, `అమ్మ ప్రేమ’ను ఎక్కువగానే ఆశించారు. కానీ, ఆ స్థాయిలో అందుకోలేకపోయారు. అనూహ్యమైన ఈ తేడాని చెన్నైవాసులు జీర్ణించుకోలేకపోతున్నారు.
జయలలిత వరద బాధిత ప్రాంతల్లో చురుగ్గా తిరగలేకపోతున్నమాట వాస్తవమే. అయితే, కదలలేనమ్మకు దూకుడెక్కువని ముందే చెప్పినట్లు ప్రచారం హోరెత్తుతోంది. చెన్నైవాసులు వేలెత్తి చూపేటంతగా కోటలుదాటిపోతోంది. దీంతో వరదబాధితులు చిటపటలాడుతున్నారు… `ఛీ..ఛీ’ అనేస్తున్నారు. వరద ప్రాంతాల్లో ప్రచార వ్యూహం ఆమెకే బెడిసికొట్టిందనే చెప్పాలి. హోర్డింగ్స్, స్టిక్కర్స్ …ఆమె సొంత నిర్ణయాలా? లేక పార్టీ శ్రేణులు తీసుకున్న తొందరపాటు నిర్ణయాలా ? అన్నది నిదానంగా తెలుస్తుంది. నిర్ణయాలు ఎవరుతీసుకున్నప్పటికీ తలకు బొప్పిమాత్రం జయలలితకు తప్పలేదు. వరదబాధితులు బాధపడేలా, ఏవగించుకునేలా పోస్టర్లు కనబడుతున్నాయి.
ఓసారి.. పోస్ట్ చేసిన ఫోటో చూడండి. బాహుబలి చిత్రంలో శివగామి పసికందుని వరద నుంచి రక్షించడంకోసం తనప్రాణాలకు తెగించి కాపాడటానికి ప్రయత్నించింది. అన్నాడిఎంకె కార్యకర్తలు ఈ దృశ్యాన్ని చెన్నై వరదలకు వర్తింపజేసుకుని అమ్మ జయలలిత వరదబాధితులను నేర్పుగా కాపాడగలిగిందన్న భావన వచ్చేలా ఫోటో ఎడిటింగ్, మార్ఫింగ్ గట్రా చేసేసి పోస్టర్లు తయారుచేయించారు. హోర్డింగ్స్ పెట్టించారు. అంతేకాకుండా అమ్మ పేరు చెప్పగానే పూనకం వచ్చి ఊగిపోయే వీరాభిమానులు వరద సహాయక ప్యాకెట్లమీద అమ్మ స్టిక్కర్స్ అంటించారు. వెలుగులోకిరాని వీర పబ్లిసిటీ వ్యవహారాలు ఇంకెన్ని ఉన్నాయో తెలియదుగానీ, ఈ రెండేచాలు అమ్మ ప్రతిష్టను దిగజార్చడానికి.
జయలలిత సినిమా ఫీల్డ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనదైన శైలిలో చక్రం తిప్పుతూనే ఉన్నారు. ఒక దశలో దేశంలోని ప్రాంతీయ పార్టీలను కూడగట్టుకుని ప్రధనమంత్రి కావాలనుకున్నారు. తమిళనాట డిఎంకె, అన్నాడిఎంకె తప్ప జాతీయ పార్టీలకు రంగు-రుచి-వాసనలు ఉండవన్నది అందరికీ తెలిసిన నిజం. ప్రాంతీయ భావజాలానికి పుట్టినిల్లులా ఉన్న తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఇలాంటప్పుడు చెన్నై వరద బాధితులను ఆదుకునే విషయాన్ని చాలా సున్నితమైన అంశంగానే ఆమె తీసుకుని ఉండాలి. కానీ అలా జరగలేదు. పైపెచ్చు, తన క్రింది నాయకగణం, కార్యకర్తల సమూహాలు తెలిసీతెలియని చేష్టలతో అమ్మకు రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తున్నారన్న వాదనలు వినబడుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, వరద రాజకీయాల్లో జయలలిత ఫెయిలయ్యారు. చెన్నైలోని వరదబాధితులను కదిలిస్తే, అమ్మను అసహ్యించుకుంటున్నారు. పైగా వీధుల్లో కనిపిస్తున్న బాహుబలి తరహాలో వెలసిన పోస్టర్లను చూసి ఏవగించుకుంటున్నారు. అమ్మ స్టిక్కర్ల సంగతి సరేసరి. ప్రజల్లో మమేకం కావాల్సిన పరిస్థితిలో ఆమె అంటీముట్టనట్లుండిపోయారు. ఇందుకు ప్రధాన కారణం అమ్మ అనారోగ్యం కావచ్చు. ఆ విషయాన్ని బాహాటంగా చెప్పిఉంటే ప్రజలనుంచి సానుభూతి వచ్చేదేమో…. అలా కాకుండా, గోప్యంగా ఉంటూ, కష్టాల్లో ఉన్న చెన్నై వాసులకు దూరంగా ఉండిపోతూ, పైపెచ్చు తానే రక్షించానంటూ ప్రచారం చేసుకోవడం నగర వాసులకు ఏమాత్రం నచ్చలేదు. ఈ నెగెటీవ్ ఎఫెక్ట్ కచ్చితంగా రాబోయే ఎన్నికలమీద ప్రభావం చూపుతుంది.
డిఎంకె పార్టీ పెద్దాయన- కరుణానిధి కూడా కదలలేని స్థితిలోనే ఉన్నారు. ఇలా రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల అగ్రనేతలు కాళ్లు జాడించి పరుగులుపెట్టే స్థితిలో లేనప్పుడు మోదీలాంటి వాళ్లు రెచ్చిపోవచ్చు. కానీ అదీ జరగలేదు. జాతీయపార్టీ, అందునా కేంద్రంలో అధికార పీఠం ఎక్కిన బిజెపీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉండాల్సింది. ప్రధానమంత్రి మోదీ ఈ దిశగా కొంతస్థాయిలో ప్రయత్నించినమాట వాస్తవమే. చెన్నై వరదల తీవ్రత తెలియగానే ఆయన అనేక పనులను ఆపుకుని చెన్నై వచ్చి వెళ్ళారు. భారీగా సాయం కూడా ప్రకటించారు. అయితే చెన్నై వాసుల్లో మోదీ పట్ల ఆకర్షణ పెరిగేలా ప్రచారఘట్టానికి బిజెపీ తెరదీయలేకపోయింది. ఈ విషయంలో మోదీ నుంచి పార్టీ కేడర్ కు స్పష్టమైన సంకేతాలు అందలేదనే చెప్పాలి. ఫలితంగా మోదీ పాత్ర కేవలం `వచ్చి, వెళ్లడం’ వరకే పరిమితమైంది. జాతీయ పార్టీగా బిజెపీ వరదబాధితులను అక్కునచేర్చుకుంటూ ప్రచారం చేసిఉంటే ఎంతోకొంత రాజకీయలబ్ది చేకూరేది. కానీ మోదీ, ఆయన అనుచర పార్టీ గణం ఆపని చేయలేకపోయారు.
తమిళ ప్రజల గుండెల్లో దేవతగా ముద్రవేసుకున్న జయలలిత ఇప్పటికైనా వాస్తవ పరిస్థితిని అర్థంచేసుకోవాలి. జరిగిన డామేజ్ ఎలాగో జరిగిపోయింది. వరద బాధితులను సంపూర్ణంగా ఆదుకునే దిశగా ఆమె మహాద్భుత వ్యూహం రచించాల్సి ఉంది. మరి అందుకు ఆమె సిద్ధంగా ఉన్నారా ? ఏమో చూద్దాం.
-కణ్వస