ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు నిన్న ప్రధాని నరేంద్ర మోడిని కలిసారు. రెండు తెలుగు రాష్ట్రాలలో తమ సంస్థ చేపడుతున్న స్వచ్చ భారత్ కార్యక్రమాల గురించి ఆయనకి వివరించారు. అలాగే తమ సంస్థలు చేపడుతున్న మల్టీ మీడియా కార్యక్రమాల గురించి కూడా ఆయనకి వివరించారు. ఈ సందర్భంగా రామోజీ రావు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, రాజీవ్ ప్రతాప్ రూడీ, రాధామోహన్ సింగ్, స్మృతీ ఇరానీ, కల రాజ్ మిశ్రా, మహేష్ శర్మలతో సమావేశమయ్యారు.
ఒక మీడియా అధినేత ఏదో ఒక కారణంతో ప్రధాని నరేంద్ర మోడిని తరచుగా కలుస్తుండటం, ఇంత మంది కేంద్రమంత్రులతో సమావేశం అవగలగడం చాలా ఆశ్చర్యం కలిగించే విషయమే. దేశంలో స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని అనేక వందల సంస్థలు అమలుచేస్తున్నాయి. అలాగే కొన్ని వేల స్వచ్చంద సంస్థలు సమాజసేవా కార్యక్రమాలలో నిమగ్నమయ్యున్నాయి. కానీ వారెవరూ ఆ వంకతో ప్రధానిని, ఇంత సునాయాసంగా కలవడం అసాధ్యం. అలాగే ఒక మీడియా అధినేత ఇంతమంది కేంద్ర మంత్రులను కలిసిన సందర్భాలు కూడా కనబడవు. ప్రధాని నరేంద్ర మోడి కూడా రామోజీ రావు పట్ల సానుకూలంగా ఉన్నందునే ఈ అసాధారణ భేటీలు సాధ్యమవుతున్నాయని చెప్పవచ్చును. అయితే ప్రధాని మోడీ మరే మీడియా అధినేతకి ఈయనంత ప్రాధాన్యత రామోజీకే ఎందుకు ఇస్తున్నారు? రామోజీ కూడా ఏదో వంక పెట్టుకొని తరచూ ప్రధాని మోడీని ఎందుకు కలుస్తున్నరనే అనుమానాలు అందరిలో వ్యక్తం అవుతున్నాయి.
ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను రామోజీ రావు పరోక్షంగా ఏవిధంగా శాసించారో అందరికీ తెలుసు. రాష్ట్ర విభజన తరువాత కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో నేటికీ రాజకీయాలను పరోక్షంగా ఆయన శాసిస్తూనే ఉన్నారు. ఆయన మీడియాలో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఒక చిన్న వార్త వస్తే ప్రభుత్వాలు హడలిపోతుంటాయి. అలాగే వివిధ ఎన్నికలలో ఆ మీడియాలో వచ్చే వార్తలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలవాణి నిరూపితమయింది. ఒకప్పుడు తెదేపా రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆయన అందించిన సహాయసహకారాలే కారణమని అందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ స్వయం శక్తిగా ఎదగాలని కలలు కంటోంది. బహుశః అందుకే రెండు రాష్ట్రాలలో రాజకీయాలను పరోక్షంగా శాసిస్తున్న రామోజీ రావు, ఆయన చేతిలో ఉన్న బలమయిన మీడియా బీజేపీకి అవసరమనే ఉద్దేశ్యంతోనే ప్రధాని నరేంద్ర మోడి రామోజీ రావుతో సాన్నిహిత్యంగా ఉంటున్నారేమోననే అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతకు ముందు రామోజీ రావు ప్రధాని నరేంద్ర మోడిని కలిసి వచ్చిన తరువాత, ఆయనకు బద్ధ శత్రువులయిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి రామోజీ ఫిలిం సిటీకి వచ్చి కలిసి వెళ్ళడం ఇటువంటి అనుమానాలకు బలం చేకూర్చేవిగా ఉన్నాయి. ఇదే నిజమయితే చంద్రబాబు నాయుడుకి ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లే భావించి అప్రమత్తం అవడం మంచిది.
ఇక మీడియా అధినేత వివిధ శాఖలకు చెందిన కేంద్ర మంత్రులతో సమావేశం కావడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడి అంతటి వ్యక్తి ఆయనతో అంత సానుకూలంగా వ్యవహరిస్తున్నపుడు, ఇక కేంద్ర మంత్రులు ఆయనను తిరస్కరించలేరు కనుకనే వారితో సమావేశాలు సాధ్యమయి ఉండవచ్చును. రామోజీ రావు తను చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు ఆ మంత్రుల సహాయ సహకారాలు ఆశించి కలిసారేమోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కారణాలు ఏవయినప్పటికీ ఒక మీడియా అధినేత ఈ విధంగా తరచూ ప్రధాని నరేంద్ర మోడితో సమావేశం అవుతుండటం చాలా విశేషమే అని చెప్పక తప్పదు.