హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యవహారశైలిపై ఆ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో పార్టీ విస్తరణపై దృష్టి పెట్టకుండా గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని, పార్టీ కన్నా స్వప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని కిషన్‌రెడ్డిపై జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఫిర్యాదులు అందాయి దానికితోడు ఆయన అధ్యక్ష పదవిలో ఉన్నంతకాలం తెలంగాణలో పార్టీ బాగుపడదని ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఫిర్యాదు చేశారు. వీటన్నింటి నేపథ్యంలో పార్టీ అధిష్టానం హైదరాబాద్‌కు పరిశీలకుడిని పంపింది. మరోవైపు జనవరిలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక ఉన్నందున కిషన్‌ను మార్చే అవకాశముందనే వాదన వినిపిస్తోంది.
అధికార పార్టీతో కుమ్మక్కై, పార్టీ నేతలను పట్టించుకోవటం లేదని కిషన్ రెడ్డిపై ప్రధానంగా ఆరోపణ. కొంతమంది నేతలు దీనికి గానూ తమవద్ద సాక్ష్యాలను కూడా సేకరించి పెట్టుకున్నారని సమాచారం. అధిష్టానం పరిశీలకుడికి ఈ సాక్ష్యాలను సమర్పించినట్లు తెలుస్తోంది. వీటన్నింటిపై ఆ పరిశీలకుడు ఒకటి, రెండు రోజుల్లో అమిత్ షాకు తుది నివేదిక ఇస్తారని చెబుతున్నారు. అమిత్ షాకు ఇప్పటికే కిషన్ రెడ్డి వ్యవహారశైలిపై సమాచారం అందిందని, ఆయన తెలంగాణలో పార్టీ పరిస్థితిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి మళ్ళీ తాను గెలవాలంటే టీఆర్ఎస్ మద్దతు అవసరమని భావించే కిషన్ రెడ్డి ఇప్పటినుంచే వారితో దోస్తీ చేస్తున్నారని అమిత్ షాకు ఫిర్యాదులు అందాయని అంటున్నారు. ఇటీవల జరిగిన వరంగల్ ఉపఎన్నికలో సీటును తమకు ఇవ్వాలని, దానికి బదులుగా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని, తలసాని శ్రీనివాస యాదవ్ ఖాళీ చేసే సనత్ నగర్ నియోజకవర్గాన్ని బీజేపీకి ఇస్తామని చంద్రబాబు విజ్ఞప్తి చేసినప్పటికీ కిషన్ రెడ్డి అంగీకరించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి రాజా సింగ్ మాత్రమే బహిరంగంగా తన అభిప్రాయాన్ని చెప్పగలిగారని, హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే కిషన్‌పై ధ్వజమెత్తేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.
జాతీయ స్థాయి రాజకీయాలలోకి వెళ్ళాలనే ఉద్దేశ్యంతోనే కిషన్ రెడ్డి రాష్ట్రంలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదనే వాదన వినిపిస్తోంది. పార్టీ జాతీయ నాయకత్వంలో ఏదో ఒక పదవిలోకి చొరబడాలని ఆయన ఆశిస్తున్నట్లు సమాచారం. అసలు గత 2014 ఎన్నికల్లోనే ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో పోటీచేద్దామని ఉవ్విళ్ళూరారు. అయితే దత్తాత్రేయవైపే పార్టీ నాయకత్వం మొగ్గు చూపటంతో కిషన్ తీవ్ర ఆశా భంగానికి గురయ్యారు. అందుకే పార్టీ బలోపేతంపై పెద్దగా దృష్టి నిలపటంలేదని అంటున్నారు. ఏది ఏమైనా కిషన్ రెడ్డిపై త్వరలో వేటు తప్పదనే వాదన బలంగా వినిపిస్తోంది.