సాధారణంగా రాజకీయ నాయకులు తమ పార్టీ అధినేతలను లేదా తమ కంటే ఉన్నత స్థానంలో ఉన్నవారిని ప్రసన్నం చేసుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తుంటారు. కొందరు తమ అధినేతల కాళ్ళమీద పడే వీరభక్తి ప్రదర్శిస్తే, మరికొందరు తమ నేతలని అవసరం ఉన్నా లేకపోయినా ఆకాశమంత ఎత్తుకు ఎత్తేసే విధంగా మాట్లాడుతుంటారు. కానీ దాని వలన ఆశించిన ఫలితం రాకపోగా ఊహించని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, అదికార ప్రతినిది వైవిబి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటల వలన చంద్రబాబు నాయుడు అటువంటి సమస్యలే వచ్చేలా ఉన్నాయి.
చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో ప్రధానమంత్రి అవుతారని, ఆయన కుమారుడు నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని, వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అవుతారని రాజేంద్ర ప్రసాద్ జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడుని ఆయన తెగ పొగిడేశారు.
అమరావతి శంఖుస్థాపన సందర్భంగా చంద్రబాబు నాయుడు కేంద్రానికి తెలియజేయకుండా, విదేశీ మంత్రులను, ప్రధానులను కలవడం, వారిని ఆహ్వానించడంతో కేంద్ర ప్రభుత్వం…ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడి కొంచెం ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వచ్చేయి. ఆ సంగతి గ్రహించిన చంద్రబాబు నాయుడు తనకు రాజధాని నిర్మాణం, రాష్ట్రాభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనలు తప్ప జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలనే కోరిక, అటువంటి ఆలోచనా కూడా లేదని చెప్పుకొన్నారు. ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోడి అమరావతి శంఖుస్థాపనకి వచ్చినపుడు ఆయనను ప్రసన్నం చేసుకొనేందుకు ఆయన పట్ల ఎంత వీరవిధేయత ప్రదర్శించారో అందరూ కళ్ళారా చూశారు.
కానీ మోడీ స్థానాన్ని భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఆక్రమిస్తారని రాజేంద్రప్రసాద్ చెపుతున్నారు. ప్రధాని మోడీ రాజకీయాల నుండి తప్పుకొంటానని ఎన్నడూ అనలేదు. అలాగే మళ్ళీ ప్రధాని పదవిని చేపట్టబోనని ఎప్పుడూ ప్రకటించలేదు. మరి ఇటువంటి మాటలు మోడీ చెవిన పడితే ఆయనకు ఎటువంటి సంకేతాలు పంపినట్లవుతుంది? మరో రెండు మూడేళ్ళలో తనే ఖచ్చితంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోతానని జగన్మోహన్ రెడ్డి బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. కనుక నారా లోకేష్ గురించి కూడా ఇప్పటి నుండి అనవసరమయిన గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదు. భవిష్యతులో అందుకు విరుద్దంగా జరిగితే చివరికి నవ్వులపాలయ్యేది ఆయనే తప్ప రాజేంద్ర ప్రసాద్ కాదు. కనుక నేతలు తమ అధినేతలకి భజన చేసే ముందు కొంచెం ఆలోచించి చేస్తే మంచిదేమో కదా?