‘ఏమైంది ఈ వేళ’ సినిమాతో దర్శకుడిగా తెరగేట్రం చేసిన కుర్రాడు సంపత్ నంది.. మొదటి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ సంపాదించిన యువ దర్శకుడు వెంటనే రెండో సినిమానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘రచ్చ’ సినిమా తీసి మంచి హిట్ ఇచ్చాడు. ఆ దెబ్బతో గబ్బర్ సింగ్ సీక్వెల్ గబ్బర్ సింగ్ -2 కి దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చే సరికి ఇక సంపత్ కి తిరుగులేదు అనుకున్నారంతా కాని గబ్బర్ సింగ్ సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ దశలోనే పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు తను తప్పుకోవాల్సి వచ్చింది.
పవర్ స్టార్ సినిమా నుండి బయటకు వచ్చాక చాలా ఇబ్బంది పడ్డ సంపత్ కి ఫోన్ చేసి మరి ఆఫర్ ఇచ్చాడట రవితేజ. అందుకే ఆడియో వేడుకలో రవితేజ గురించి ఉత్తేజంగా భావోద్వేగంతో మాట్లాడాడు సంపత్ నంది. రచ్చ తర్వాత అనుకున్న కథని రవితేజకు చెప్పడం ఆయన ఒక సిట్టింగ్ లోనే ఓకే చేయడం అంతా జరిగిపోయాయి. ఇంకో రెండు రోజుల్లో విడుదలవుతున్న బెంగాల్ టైగర్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. రవితేజ కూడా కిక్-2 అపజయంతో వచ్చిన చెడ్డ పేరుని ఈ సినిమాతో కడిగేయాలనుకుంటున్నాడు.
పవన్ తో సినిమా ఛాన్స్ కోల్పోయినా తనతో మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్న సంపత్ నంది బెంగాల్ టైగర్ లో ఆ కసి మొత్తం చూపించాడనిపిస్తుంది. తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటించిన బెంగాల్ టైగర్ మంచి విజయం సాధించి అటు సంపత్ నందికి, ఇటు రవితేజకి సినిమాల్లో అదిరిపోయే హిట్ గా నిలవాలని కోరుకుందాం.