అధికారానికి దూరమైన తర్వాత కాంగ్రెస్ వారికి దేశంలో ప్రతిదీ చెడుగానే కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మాచెడ్డగా కనిపిస్తోంది. తమకు 44 సీట్లు మాత్రమే ఇచ్చిన ప్రజలపట్ల చిత్తశుద్ధి తరిగిపోతోంది.
నేషనల్ హెరాల్డ్ కేసులో కోర్టుకు హాజరు కాకుండా సోనియా, రాహుల్ గాంధీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సమన్లపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నో చెప్పింది. వారిద్దరూ ట్రయల్ కోర్టు విచారణకు హాజరు కావాల్సిందే అని స్పష్టం చేసింది.
అయినా తల్లీ తనయుడు మంగళవారం నాడు విచాణకు హాజరు కాలేదు. ముందస్తు కార్యక్రమాలతో బిజీగా ఉన్నారంటూ వారి న్యాయవాది, కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ మను సింఘ్వీ కోర్టులో చెప్పారు. తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరవుతారని తాను హామీ ఇస్తున్నానని తెలిపారు. ఆ హామీ మేరకు కోర్టు తదుపరి విచారణ తేదీని ప్రకటించింది. ఈనెల 19న మధ్యాహ్నం 3 గంటలకు తప్పకుండా విచారణకు రావాలని ఆదేశించింది.
ఇదంతా జరిగేసరికి తల్లీతనయుల్లో అసహనం పెరిగింది. దేశాన్ని పాలించిన ప్రభుత్వాన్ని ఒంటిచేత్తో శాసించిన సోనియా, రాహుల్ కు తాజా పరిణామాలు మింగుడుపడటం లేదు. దీంతో, ప్రభుత్వంపై దాడి మొదలుపెట్టారు. ఇది రాజకీయ కక్ష అని ఆరోపించారు. తాను ఇందిరా గాంధీ కోడలినని, ఎవరికీ భయపడేది లేదంటూ సోనియా గాంధీ కొత్తగా పంచ్ డైలాగ్ చెప్పారు. పార్లమెంటులో కాంగ్రెస్ సభ్యులు రభస సృష్టించారు. కనీసం కారణం చెప్పకుండా రాజ్యసభలో వెల్ లోకి దూసుకుపోయి అరుపులు కేకలు ఎందుకు వేస్తున్నారని డిప్యుటీ చైర్మన్ అడిగినా కాంగ్రెస్ సభ్యులు పట్టించుకోలేదు. పదే పదే సభకు అడ్డు తగిలారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో కేవలం 50 లక్షల రూపాయలతో కోట్ల విలువైన ఆస్తులను సోనియా, రాహుల్ సొంతం చేసుకున్నారని బీజేపీ నాయకుడు సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. 2012లో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అప్పటికి కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాలేదు. కాబట్టి మోడీ ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపు అనేది అబద్ధం అని తేలిపోయింది. ఈ మాత్రం లాజిక్ కూడా లేకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై విమర్శల దాడిని తీవ్రం చేయాలని నిర్ణయించింది.
మరో వైపు కమలనాథులు కౌంటర్ అటాక్ ప్లాన్ చేశారు. ఈనెల 19 వరకూ ఈ అంశం ప్రజల్లో చర్చనీయాంశంగా ఉండేలా చూడాలని నిర్ణయించారు. కోర్టు కేసును కోర్టులోనే ఎదుర్కోవాలి. అది మానేసి కేంద్రంపై దుమ్మెత్తి పోయడం, పార్లమెంటను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అనాలోచితంగా వ్యవహరిస్తోందని ప్రజలకు వివరించాలనేది బీజేపీ వ్యూహం. ప్రతి దానికీ ప్రభుత్వాన్ని నిందించి సానుభూతి కొట్టేయాలన్న తల్లీ తనయుల ఎత్తుగడ ఫలిస్తుందో లేదో చూద్దాం.