సంచలన దర్శకుడు వర్మ ఏం చేసినా అదో రకంగా ఉంటుంది. అసలేం లేకపోతేనే ఉన్నట్టు ఊహించి సంచలనాలు సృష్టించే వర్మ ఇక ఆడియో వేడుకకి వచ్చి గమ్ముగా ఉంటాడా చెప్పండి అదే సన్నివేశం నిన్న జరిగిన లోఫర్ ఆడియో వేడుకలో జరిగింది. వరుణ్ తేజ్, దిశా పాట్ని జంటగా నటించిన లోఫర్ సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఆడియోకి విడుదలకు అతిథిగా అమరేంద్ర బాహుబలి ప్రభాస్ రాగా.. పూరి తన గురువుగారైన వర్మకి కూడా ఆహ్వానాన్ని అందించాడు.
ఆ కార్యక్రమంలో వర్మ చేతికి మైక్ అందితే ఎలా ఉంటుంది చెప్పండి. వరుణ్ తేజ్ ని పొగిడినట్టే పొగిడి మెగా ఫ్యామిలీకి సెటైర్స్ వేశాడు వర్మ. ఇక వాటినే ట్విట్టర్లో కూడా పొందుపరిచాడు.. చెట్టు పేరు చెప్పుకునే కాయలమ్మే బ్యాచ్ వరుణ్ తేజ్ ది కాదని.. మెగా చెట్టు కరెంట్ లేకుండానే వరుణ్ తేజ్ ఎదగాలనుకోవడం తనకు బాగా నచ్చిందని.. వరుణ్ తేజ్ దగ్గర సోలార్ ఉందని.. మెగా చెట్టుకి కొన్నాళ్లకు పవర్ పోయే అవకాశం ఉందేమో కాని సోలార్ కి అలాంటి చాన్స్ లేదని వెరైటీ ట్వీట్స్ చేశాడు వర్మ.
ప్రపంచంలో ప్రతి ఒక్క విషయమీద తనదైన శైలిలో స్పందించి అందరిని ఆశ్చర్యపరిచేలా చేసే వర్మ ట్వీట్లు ఇప్పుడు కొత్తవేం కాకపోయినా వర్మ వరుణ్ తేజ్ ని పొగిడినట్టే పొగిడి ఎవరికి సెటైర్ వేశాడా అన్నదాని గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనా నిన్న అతిథిగా వచ్చిన ప్రభాస్ కన్నా వర్మ ఏం మాట్లాడతాడా అన్న దాని గురించే అందరు ఆలోచించారంటే వర్మ ఎంత గొప్ప విమర్శకుడో అర్ధమవుతుంది.