వరద నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చెన్నై మహానగరానికి పెనుముప్పు పొంచిఉన్నదనీ, కుండపోతగా 250 సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం ఉన్నదనీ, చెన్నై మునిగిపోతుందంటూ `మహా హెచ్చరిక’ ఒకటి సోషల్ మీడియా – వాట్సాప్ లో హల్ ఛల్ చేస్తోంది. ఈ మెసేజ్ చూసినవారి గుండె ఆగిపోవడం ఖాయం. అంత పకడ్బందీగా మెసేజ్ తయారుచేసి పంపారు. దీంతో ఇది వైరల్ గా స్ప్రెడ్ అవుతోంది.
`హెచ్చరిక’ అంటూ విడుదల చేసిన ఈ మెసేజ్ లో వచ్చే 72 గంటల్లో చెన్నైలో అత్యంత భారీవర్షాలు పడబోతున్నాయని, ఈమధ్య నగరవాసులు చవిచూసిన వర్షపాతానికి ఇది అనేక రెట్లు ఎక్కువని ఉంది. ఒకటి రెండు రోజుల క్రిందటే వర్షం తగ్గి తేరుకుంటున్న చెన్నైవాసులు వర్షం పేరుచెబితేనే భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాట్సాప్ మెసేజ్ వారిని హడలెత్తిస్తోంది. పైగా, `చెన్నైలో మీ స్నేహితులు, బంధువులు ఉంటే వారిని వెంటనే నగరాన్ని విడిచి వెళ్లమని చెప్పండి’ అంటూ సలహా కూడా ఇచ్చారు. ఆ మెసేజ్ లో ఇంకా ఇలా ఉంది….
`నాసా అందించిన రిపోర్ట్ ప్రకారం, ఇది మామూలు వర్షంకాదు. దీన్ని `ఎల్ నినో తుపాను’గా పిలుస్తారు. 250 సెంటీమీటర్ల దాకా వర్షం పడొచ్చు. చెన్నై మొత్తం మునిగిపోవచ్చు. ఈ విషయంపై వివరాలు కోరుకునేవారు గూగుల్ లో సెర్చ్ చేసుకోవచ్చు. చెన్నైలోని మీ స్నేహితులు, బంధువులకు ఈ విషయం చెప్పండి…’ అంటూ మెసేజ్ సాగిపోయింది. నిజానికి నాసా కేంద్రం ఎప్పుడూ తుపాన్ల రాక గురించి చెప్పదు. అలాగే, ఎంత వర్షపాతం పడుతుందన్నది కూడా చెప్పదు. వాతావరణ కేంద్రాలు, సంస్థలు మాత్రమే ఇలాంటి సమాచారాన్ని అందిస్తుంటాయి.
విప్రో సంస్థ వాళ్లు తమ ఉద్యోగుల కోసం వంద బస్సులను ఏర్పాటుచేశారట. కోయంబేడు బస్ స్టాప్ దగ్గర ఈ బస్సులు బయలుదేరతాయట. ఇక విమాన సర్వీసులు ఎప్పుడు బయలుదేరతాయో కూడా ఈ మెసేజ్ లో పెట్టారు.
ఈ తరహా మెసేజ్ వాట్సాప్ లో స్ప్రెడ్ అవడంతో ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. చెన్నై వరదకు గురైన సమయంలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషించింది. టివీ మీడియా కూడా తమ వార్తా కథనాల్లో సోషల్ మీడియాలోని విశేషాలను ప్రముఖంగా ఉటంకించింది. అయితే ఇప్పుడు ఇలాంటి వదంతులకు కూడా ఇదే మీడియా వేదికైంది. నిజానికి ఈ మెసేజ్ సోమవారం తొలిసారి కనిపించింది. ఇప్పటికే 24 గంటలు గడిచిపోయాయి. విప్రో బస్సులు బయలుదేరిన జాడేలేదు. ఎల్ నినో వల్ల ఒక్కోసారి అల్పపీడనాలు, తుపాన్లు ఏర్పడతాయన్నది నిజమేగానీ, ప్రస్తుతం చెన్నైలో భారీవర్షాలు పడే అవకాశాలు దాదాపుగాలేవని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. వాట్సాప్ మెసేజ్ లో కేవలం చెన్నైనే కేంద్రబిందువుగా చేసుకుని ఎల్ నినో తుపాను దాడి చేస్తుందనడం శుద్ధతప్పని వారంటున్నారు. నిజానికి తుపాను వస్తే చెన్నైసహా చాలా ప్రాంతాల్లో భారీవర్షాలు పడతాయని చెబుతున్నారు. సో, టెకిట్ ఈజీ. అలాంటి మెసేజ్ మీ ఫోన్ కు వస్తే, కంగారుపడకండి, చెన్నై వాసులకు మీ వంతు సహాయం చేయడంలో నిమగ్నమవ్వండి. దయచేసి ఇలాంటి మెసేజ్ లను ప్రోత్సహించకండి.
– కణ్వస