నందమూరి నట సింహం బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి అభిమానులకు ఇద్దరు రెండు కళ్లు అంటే అతిశయోక్తి కాదేమో.. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట ప్రస్థానాన్ని కొనసాగిస్తూ యువరత్నగా బాలయ్య బాబు అశేష ప్రేక్షకుల అభిమానన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా తాత పోలికలు కలిసి రావడంతో నందమూరి అభిమానులు అక్కున చేర్చుకున్నారు. ముందు నందమూరి అండతో క్రేజ్ సంపాధించిన ఎన్టీఆర్ సొంతంగా అభిమానులను ఏర్పరచుకునే ప్రయత్నం చేశాడు.
ఆ దారిలోనే బాబాయ్ తో కాస్త వ్యవహారం చెడిందని అప్పట్లో వార్తలొచ్చాయి. అప్పుడు బాలయ్య సినిమా ఆడియోకి ఎన్టీఆర్, ఎన్టీఆర్ సినిమా ఆడియోకి బాలయ్య బాబు వచ్చేవారు. వారిద్దరు వచ్చిన వేడుక నందమూరి అభిమానుల కోలాహాలంతో నిండిపోయేది. మధ్యలో కాస్త ఇద్దరి మధ్య దూరం పెరిగే సరికి ఒకరి సినిమాలు ఒకరికి సంబధం లేకుండా చేసుకుంటున్నారు. అయితే ప్రస్తుతం పరిణామాలు మారాయి. ఎన్టీఆర్ కు తన అన్న కళ్యాణ్ రామ్ పూర్తి సహాకారం అందిస్తున్నాడు. ఇక ఇదే అధునుతో బాబాయ్ తో కూడా దూరమైన బంధాన్ని దగ్గర చేసుకోవాలనే ఆలోచనతో ఎన్టీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది.
ఆ క్రమంలోనే ప్రస్తుతం చేస్తున్న నాన్నకు ప్రేమతో సినిమా ఆడియో వేడుకకి అతిథిగా బాలయ్య బాబుని పిలిచే అవాకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఒకవేళ బాలయ్య బాబు ఈ ఆడియోకి రావడం నిజమే అయితే కచ్చితంగా నందమూరి అభిమానులు పండుగ చేసుకున్నట్టే.. ఎన్టీఆర్ ఆడియోకి అతిథిగా ఎవరిని ఆహ్వానించాలా అనేది చిత్ర యూనిట్ సందిగ్దంలో పడ్డారట. కచ్చితంగా ఓ ప్రత్యేక అతిథి వచ్చే అవాకాశాలు ఉన్నాయని సమాచారం. అనుకున్నట్టే బాలయ్య వస్తాడా ఇంకా వేరే ఎవరైనా వస్తారా అన్నది తెలియాల్సి ఉంది.