దేశంలో అసహనం రాజ్యమేలుతోందనీ, మతపరమైన సహనశీలత మచ్చుకైనా లేదని రాజకీయనాయకులు, బడా మేధావులు నానాయాగీ చేస్తున్నారేగానీ, నిజానికీ మతసహనం చెక్కుచెదరలేదని నిరూపించే సంఘటనలు జరుగుతున్నా వాటిని మచ్చుకైనా ప్రస్తావించడంలేదు.
అన్యమతస్థుల కష్టాన్ని తమ కష్టమని భావిస్తూ చెన్నైలో ఎంతోమంది ముస్లీం యువకులు హిందుమతస్థులైన బాధితులకు చేతనైన సాయం చేస్తున్నారు. అంతేకాదు, నిత్య దూపదీపనైవేద్యాలతో కళకళలాడాల్సిన హిందూ ఆలయాలు వరదనీటిలో మునిగిపోయి, బురద పేరుకుపోవడంతో ముస్లీం యువకులను కలచివేసింది. అందుకే వారు హిందూ ఆలయాలను శుభ్రంచేసే పని చేపట్టారు. ఏ మతానికి చెందిన ప్రార్థనామందిరమైనా తమకు ఒక్కటేఅనీ, మానవత్వమే అసలు మతమని వారంటున్నారు. అయితే, ఇలాంటి సంఘటనలను కుహనా సెక్యులర్ వాదులు చెవికెక్కించుకోరు. ఇదో దురదృష్టకరమైన పరిస్థితి.
ముస్లీం స్వచ్ఛంద సంస్థ – `జమ్మత్ ఈ ఇస్లామీ హింద్’ కు చెందిన 50 మంది యువకులు మసీదులను శుభ్రపరుస్తుంటారు. వీరిప్పుడు హిందువుల ఆలయాల దుస్థితి చూసి చలించిపోయి, వాటిని శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టారు. మూడు రోజుల క్రిందట వారీపని ప్రారంభించారు. కొత్తూర్ పురం, సైదాపేటల్లోని హిందూ దేవాలయాలను శుభ్రపరిచారు. తమకు మసీదులైనా, ఆలయాలైనా ఒకటేనంటున్నారు. వారంరోజులపాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారట. మిగతాచోట్ల దెబ్బతిన్న ఆలయాలను మామూలు స్థితికి తెచ్చేందుకు ఈ ముస్లీం యువకులు ప్రయత్నిస్తారు. తాము ఎక్కడికెళ్ళినా స్థానిక హిందువుల నుంచి ప్రోత్సాహం లభిస్తోందనీ, సోదరభావంతో కలసి పనిచేస్తున్నామని ఈ బృందంలో ఒకరైన పీర్ మహమ్మద్ (ఇంజనీర్) చెబుతున్నారు. వరద బాధితులను ఆదుకునే విషయంలో కులమతాలను పక్కనబెట్టి కలసికట్టుగా సాయం అందించాలని ముస్లీం పెద్దలు కోరుకుంటున్నారు.
అయితే ఇలాంటి వార్తలను మీడియా ఎక్కువగా ప్రచారం చేయడంలేదు. నెగెటీవ్ వార్తలకే ప్రాధాన్యం ఇవ్వడానికి అలవాటుపడిన టివీ మీడియా కంటికి ఈ పాజిటీవ్ వార్తలు కనబడవన్న సంగతి మరోసారి ఋజువైంది.