హైదరాబాద్: తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షాలు చేతులెత్తేశాయి. నిన్న మొన్నటివరకు హడావుడి చేసిన ప్రతిపక్షాలు అనేక చోట్ల అసలు నామినేషన్లు కూడా దాఖలు చేయలేదు. తెలంగాణలో స్థానిక సంస్థల ప్రతినిధులు ఎన్నుకునే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళ సాయంత్రం నామినేషన్ల ఘట్టం ముగిసింది. మొత్తం 12 స్థానాలకుగానూ అధికార టీఆర్ఎస్ పార్టీ అన్నింటికీ నామినేషన్లు వేసింది. మిగతా పార్టీలు కొన్ని జిల్లాలకే పరిమితమయ్యాయి. కరీంనగర్, వరంగల్, అదిలాబాద్ జిల్లాలలో అభ్యర్థులు దొరకక కాంగ్రెస్ 5 చోట్ల మాత్రమే బరిలో నిలిచింది. టీడీపీదీ అదే పరిస్థితి. బీజేపీ అసలు ఈ ఎన్నికల బరిలోనే లేదు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాలలో మాత్రం ఈ ఎన్నికలు రసవత్తరంగా మారేటట్లు కనిపిస్తోంది. నల్గొండలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. పోలింగ్ 27న, కౌంటింగ్ 30న జరుగనుంది.