విజయవాడలో స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ లో కల్తీ మద్యం త్రాగి ఐదుగురు వ్యక్తులు మరణించిన కేసులో పోలీసులు కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు మల్లాది విష్ణుని కూడా నిందితుడిగా చేర్చి అరెస్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు రావడంతో ఆయన నిన్నటి నుండి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. ఆ బార్ తో తనకు ఎటువంటి సంబంధము లేదని మొదట ఆయన వాదించారు. కానీ ఆయన 2014 ఎన్నికలలో తన అఫిడవిట్ లో ఆ బార్ లో తనకు వాటా ఉందని పేర్కొన్నారు. నగర పోలీసులు దాని ఆధారంగానే ఆయనపై కేసు నమోదు చేశారు. ఇది కాకుండా ఆయన కుటుంబీకుల పేరిట గవర్నర్ పేటలో స్వర్ణమయి బార్, గాంధీ నగర్ లో ఖుషీ బార్, కృష్ణ లంకలో స్వర్ణ బార్ ఉన్నాయని ఎక్సయిజ్ అధికారులు చెపుతున్నారు. కనుక ఈ కల్తీ మద్యం కేసులో మల్లాది విష్ణుని పోలీసులు అరెస్ట్ చేయడం ఖాయమని తెలుస్తోంది.
“మల్లాది విష్ణు రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని నిలదీస్తున్నారు కనుకనే ఆయనపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పూనుకొంటోందని” ఆరోపించిన పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి కూడా మళ్ళీ అదే మాటను గట్టిగా అనలేకపోతున్నారిప్పుడు. కల్తీ మద్యం అమ్మిన స్వర్ణ బార్ అండ్ రెస్టారెంట్ మల్లాది విష్ణుదేనని పోలీసులు స్పష్టమయిన ఆధారాలు చూపిస్తున్నారు కనుక ఇప్పుడు ఆయనను వెనకేసుకురాలేని పరిస్థితి ఏర్పడింది. రఘువీరా రెడ్డి ఇంతకు ముందు ఆయనకు మద్దతుగా మాట్లాడిన మాటలను కూడా వెనక్కి తీసుకొని ఆయనను పార్టీలో తొలగించవలసిన పరిస్థితి కనిపిస్తోంది.