హైదరాబాద్: ఇప్పటివరకు 6-7 తరగతులనుంచి ఐఐటీ, ఐఏఎస్ టార్గెట్‌గా కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఫౌండేషన్ కోర్సులు నడిపించటం గురించి అక్కడక్కడా చూశాం. కానీ వరంగల్‌లోని కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఏకంగా నర్సరీనుంచే ఐఏఎస్‌కు శిక్షణ ఇస్తామంటూ వ్యాపారం మొదలు పెట్టేశాయి. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేశాయి. రెగ్యులర్‌గా తీసుకునే ఫీజులతో పాటు అదనంగా ఈ ఐఏఎస్ శిక్షణకోసం ఒక్కో విద్యార్థినుంచి రు.2 వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇటువంటి మోసాన్ని వరంగల్ జిల్లాలో పాఠశాల విద్యాశాఖ అధికారులు గుర్తించారు. ఇలాంటి పాఠశాలలు ఒక్క వరంగల్‌లోనే పదికి పైగా ఉన్నాయని చెబుతున్నారు. ఇలాంటి ఫౌండేషన్ తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా వేలసంఖ్యలో ఉంటాయని అనుమానిస్తున్నారు.
ప్రైవేట్ పాఠశాలల్లో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయటంపై ఫిర్యాదులు అందటంతో విద్యాశాఖ ఇటీవల ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి ప్రముఖ పాఠశాలల్లో తనిఖీలు చేసింది. ఇందులోనూ విస్తు గొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. ఏసీ క్లాస్ రూములు, ఐఐటీ ఫౌండేషన్ శిక్షణల పేరుతో ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు బయటపడింది. వసూలు చేస్తున్న ఫీజులకు, విద్యాబోధనకు సంబంధం లేదని వెల్లడయింది. దీంతో ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వివిధ శిక్షణల పేరుతో విద్యార్థులపై అదనపు భారం మోపడమే కాకుండా అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసే ఈ పాఠశాలలపై చర్యలు తీసుకోటానికి విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తల్లిదండ్రుల ఆశలను ఆసరా చేసుకుని ఇష్టారాజ్యంగా పాఠశాలలు చేస్తున్న ఫీజు వసూళ్ళపై నియంత్రణకు ప్రభుత్వం నడుం బిగించింది. ఐఐటీ, ఒలింపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ-టెక్నో, ఈ-శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ వంటి పేర్లతో అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసే ఈ స్కూళ్ళలో ఒక్కో తరగతిలో 100 నుంచి 150 మంది వరకు పిల్లలుంటే వారిలో 5-10 మంది పైనే ప్రత్యేక దృష్టి పెట్టి వారినే చూపిస్తూ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించామని ప్రచారం చేసుకోవటం ఈ స్కూల్స్ అనుసరిస్తున్న విధానం. ప్రభుత్వ గురుకుల విద్యాలయాలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 90 శాతం ఫలితాలు వస్తుంటే, లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల్లో 50 నుంచి 60 శాతం ఫలితాలు మాత్రమే నమోదవుతున్నట్లు విద్యాశాఖ కనుగొంది. ఎన్సీఈఆర్టీ రూపొందించిన ప్రభుత్వ పాఠ్యపుస్తకాలకంటే ప్రైవేట్ పబ్లికేషన్స్ తయారుచేస్తున్నపాఠ్యపుస్తకాలనే ప్రైవేట్ పాఠశాలలు బట్టీ పట్టిస్తున్నాయి. పైగా అవే అడ్వాన్స్డ్ అని విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి.
రాష్ట్ర స్థాయిలో ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా ప్రైవేట్ పాఠశాలల్లో ఆదాయ-వ్యయాల లెక్కల ప్రకారం ఫీజులు ఖరారు చేసి, వాటిని పాఠశాలలు, తరగతులవారీగా వర్గీకరిస్తూ నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. నాణ్యమైన విద్య పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులకు కుచ్చుటోపీ పెడుతున్న ప్రైవేట్ పాఠశాలలను దారిలోకి తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉంది. వృత్తి విద్యా కోర్సుల ఫీజులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన నియంత్రణ కమిటీ తరహాలోనే ప్రైవేట్ పాఠశాలల ఫీజులకు కూడా రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో చట్టబద్ధత కలిగిన సంస్థనొకదానిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని పక్కాగా అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించింది.