హైదరాబాద్: 13 ఏళ్ళ క్రితం ముంబాయిలో జరిగిన యాక్సిడెంట్ కేసులో సల్మాన్ ఖాన్‌ను నిర్దోషిగా బాంబే హైకోర్ట్ ప్రకటించింది. ఈ కేసులో కింది కోర్ట్ ఈ ఏడాది మే 6న సల్మాన్‌ను దోషిగా నిర్ధారించి 5 సంవత్సరాల కారాగార శిక్షను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తీర్పుపై సల్మాన్ చేసిన అప్పీల్‌పై హైకోర్ట్ ఇవాళ తీర్పు ఇచ్చింది. ఇవాళ మధ్యాహ్నం సల్మాన్ ఖాన్ ఇవాళ కోర్టుకు హాజరు కాగానే తీర్పును వెలువరించింది. ప్రాసిక్యూషన్ సల్మాన్‌పై నేరాన్ని నిరూపించలేకపోయిందని హైకోర్ట్ అభిప్రాయపడింది. పోలీసుల దర్యాప్తు కూడా తప్పుల తడకగా ఉందని పేర్కొంది. దర్యాప్తులో, ప్రాసిక్యూషన్ సాక్ష్యాలలో చాలా లోపాలున్నాయని వ్యాఖ్యానించింది. సల్మాన్‌పై అభియోగాలన్నింటినీ కొట్టిపారేసింది. కోర్ట్ తీర్పు వెలువరించగానే సల్మాన్ న్యాయమూర్తికి వంగి నమస్కరించారు. సల్మాన్ పాస్‌పోర్ట్‌ను వెనక్కు ఇవ్వాలని కోర్ట్ పోలీసులను ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుపై సుప్రీమ్ కోర్టులో అప్పీల్ చేయనుందని తెలుస్తోంది.
2002 సంవత్సరం సెప్టెంబర్ 28న జరిగిన ఈ యాక్సిడెంట్లో సల్మాన్‌పై మోపబడిన అభియోగం ప్రకారం – అతను తన మిత్రుడు – సింగర్ కమాల్ ఖాన్, మరికొందరితో కలిసి ఒక హోటల్‌కు వెళ్ళి వస్తూ తాగి కారు నడిపి పేవ్‌మెంట్‌పై నిద్రిస్తున్న ఒకరి మృతికి కారణమయ్యారు. ఈ ఘటనలో మరో ముగ్గురు కూడా గాయపడ్డారు. అయితే ఆ సమయంలో కారు నడిపింది సల్మాన్ కాదని, తానని డ్రైవర్ అశోక్ సింగ్ చెప్పాడు. మరోవైపు, ఘటన జరిగినపుడు సల్మాన్ తాగి ఉన్నాడని, అతనిని కారు నడపొద్దని కూడా తాను చెప్పానన్న సల్మాన్ బాడీగార్డ్, ఈ కేసులో కీలక సాక్షి, పోలీస్ కానిస్టేబుల్ రవీంద్ర పాటిల్, అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయాడు. ఇదంతా గమనిస్తే ఆ యాక్సిడెంట్ చేసింది ఎవరనేది చిన్నపిల్లలకైనా అర్థమవుతుంది… కానీ కోర్టులకు కావల్సింది సాక్ష్యాలు కదా!