వచ్చే నెలలోనే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక జంట నగరాలలో నివసిస్తున్న ఆంధ్ర ప్రజల పట్ల తెరాస నేతల స్వరంలో కూడా మార్పు కనబడుతోంది. ఇంతకు ముందు తెలంగాణాలో విద్యుత్ సంస్థలలో, షెడ్యూల్ 9, 10 ల క్రిందకు వచ్చే సంస్థలలో పనిచేసే ఆంధ్రా ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా బయటకు పొమ్మని చెప్పిన తెలంగాణా ప్రభుత్వం, ఆ తరువాత జంట నగరాలలో ఓటర్ల జాబితా సవరణ పేరిట సుమారు 7 లక్షల మంది ఆంధ్రా ఓటర్ల పేర్లను తొలగించింది. దానిపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. చివరికి కేంద్ర ఎన్నికల సంఘం ఒక పరిశీలకుల బృందాన్ని పంపించవలసి వచ్చింది. ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి.
హైదరాబాద్ నగర తెరాస అధ్యక్షుడు మైనంపల్లి హనుమంతరావు మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ లో నివసిస్తున్న ప్రజలు అందరూ తెలంగాణా ప్రజలేనని అన్నారు. జంటనగరాలలో అన్ని ప్రాంతాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారని, ప్రభుత్వం ఎవరి పట్ల వివక్ష చూపడం లేదని అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా అటువంటి అభిప్రాయమే వ్యక్తం చేసారు. గత కొన్ని నెలలుగా జంట నగరాలలో సాధారణ పరిస్థితులు కనబడుతున్నాయి. ఇది ఖచ్చితంగా తెరాసకు కలిసివచ్చే అంశమే.
అసలు జంట నగరాలలో స్థిరపడిన ఆంధ్రా ప్రజల పట్ల తెలంగాణా ప్రభుత్వం, తెరాస నేతలు మొదటి నుండి ఇదే విధంగా సామరస్యంగా వ్యవహరించి ఉండి ఉంటే నేడు వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇటువంటి మాటలు మాట్లాడవలసిన అవసరమే ఉండేదే కాదు. ఏ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకయినా తాము సుఖంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించగలిగితే చాలని కోరుకొంటారు. వారికి ఆ భరోసా ఎవరు కల్పిస్తే వారినే ఎన్నుకొంటారు తప్ప తమకు ప్రయోజనం లేని రాజకీయ పార్టీలకు ఓట్లు వేసి గెలిపించరు. డిల్లీ, బిహార్ ఎన్నికలు అందుకు చక్కటి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చును. రెండు చోట్లా హేమాహేమీలయిన జాతీయపార్టీలు పోటీ పడ్డాయి. కానీ ప్రజలు తమకు అందుబాటులో ఉంటాయనుకొన్న పార్టీలకే అధికారం కట్టబెట్టారు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇంత చిన్న విషయాన్ని తెరాస నేతలు విస్మరించి, ఈ ఎన్నికలలో గెలవడానికి అనేక ఆలోచనలు చేసారు.
జంట నగరాలలో నివసిస్తున్న ఆంద్ర ప్రజలలో అభద్రతా భావం కలగకుండా వ్యవహరిస్తూ వారి పట్ల ఎటువంటి వివక్ష ప్రదర్శించకుండా మామూలుగా వ్యవహరించి ఉండి ఉంటే సమస్య గోటితోనే పోయేది. కానీ తెరాస నేతలు మొదట్లో ప్రదర్శించిన అత్యుత్సాహం వలననే ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికయినా మించి పోయిందేమీ లేదు. జంట నగరాలలో ప్రజలందరినీ ఒకేలా చూస్తే మున్ముందు ఈ సమస్య మళ్ళీ ఎదురవదు.