హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి వెంకయ్యనాయుడును కలిసి తాను నిర్వహించబోతున్న ఆయుత చండీయాగానికి ఆహ్వానించారు. వెంకయ్యనాయుడు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ తనను యాగానికి ఆహ్వానించారని, 24న తాను యాగానికి హాజరవుతానని చెప్పారు. యాగాలు వ్యక్తిగతంగా చేస్తే తప్పు లేదని అన్నారు. గృహనిర్మాణాలపై చర్చించామని తెలిపారు. తెలంగాణకు మరిన్ని ఇళ్ళను మంజూరు చేయాలని కేసీఆర్ కోరారని, ప్రతిపాదనలు పంపితే ఇళ్ళు మంజూరు చేస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. తెలంగాణకు హడ్కో రు.3,100 కోట్ల రుణం మంజూరు చేయటానికి సూత్రప్రాయంగా అంగీకరించిందని వెల్లడించారు. నియోజకవర్గాల పునర్విభజనపై కూడా చర్చించినట్లు తెలిపారు. నియోజకవర్గాలను పెంచాలని ఏపీ ప్రభుత్వం నుంచి కూడా విజ్ఞప్తులు అందాయని చెప్పారు. తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలను 117 నుంచి 153కు పెంచాలని, ఏపీలో 175 నుంచి 225కు పెంచాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ విషయంలో రాజ్యాంగ సమస్యలు ఉన్నాయని, రాజ్యాంగాన్ని లేదా చట్టాన్ని సవరించాలా అనేదానిపై న్యాయశాఖ కార్యదర్శితో చర్చిస్తామని వెంకయ్య అన్నారు.
మరోవైపు కేసీఆర్ కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను కూడా కలిసి యాగానికి ఆహ్వానించారు. ఇవాళ పవార్ జన్మదినం సందర్భంగా పుష్పగుఛ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. పవార్ తెలంగాణ డిమాండ్‌కు మద్దతిచ్చారని, కేంద్ర మంత్రిగా బాగా పనిచేశారని కేసీఆర్ అన్నారు.