హైదరాబాద్: విశాఖపట్నం జిల్లాలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా మన్యంలోని చింతపల్లిలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగసభ విజయవంతమైంది. సభకు ఆదివాసీలు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడపై నిప్పులు చెరిగారు. గిరిజనులను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు. తర్వాత మాట్లాడిన జగన్, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షనేతగా ఉన్నపుడు బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించారని, అధికారంలోకి రాగానే మాట మార్చారని జగన్ ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాలపై విడుదల చేసిన శ్వేతపత్రంలో గ్రామసభల ద్వారా ప్రజలు తవ్వకాలకు అనుమతి ఇచ్చారని పేర్కొన్నారని, అయితే అసలు గ్రామసభలు జరగనేలేదని స్థానికులు చెబుతున్నారని జగన్ తెలిపారు. గిరిజన ఎమ్మెల్యేలు ఏడుగురిలో ఆరుగురు వైసీపీ వారే ఉన్నారని, అందుకే చంద్రబాబు ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేయటం లేదని జగన్ ఆరోపించారు. ఇప్పటికైనా బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన జీవో నం.97ను వెనక్కుతీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి తేవటంతో బాక్సైట్ తవ్వకాలకు ఆగస్టులో అనుమతి ఇచ్చిందని చెప్పారు. వైఎస్ మొదట బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చినా, ప్రజల అభిప్రాయం తెలుసుకుని దానిని ఆపేశారని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఒక్క వెంట్రుక కూడా పీకలేడని, అందరమూ ఒక్కటై పోరాడదామని జగన్ అన్నారు. బాక్సైట్ తవ్వకాలను ఒక్క అడుగు కూడా ముందుకు కదలనీయమని చెప్పారు.