ప్రజలు తాము ఏదో ఒక రాజకీయ పార్టీకో లేదా తమకు నచ్చిన ఒక రాజకీయ నేతకో ఓటు వేస్తున్నామని దృడంగా నమ్ముతూ ఓట్లు వేస్తుంటారు. కానీ రాజకీయ నాయకులు ప్రజలు తమ పట్ల ఉంచిన నమ్మకాన్ని, వారి అభిప్రాయాలని తుంగలో తొక్కుతూ పార్టీలు మారుతుంటారు. తద్వారా తమకు ఓటేసి గెలిపించిన ప్రజలను, ప్రజాస్వామ్య వ్యవస్థను వారు అపహాస్యం చేస్తున్నారు. కానీ రాజకీయ నేతలు పార్టీలు మారడం చాలా సహజమని భావించేంతగా ప్రజలకు ‘బ్రెయిన్ వాష్’ చేసేసారు కనుక ఇప్పుడు దానిని ప్రజలు తప్పుగా భావించడం లేదు. ప్రజలు భావించడం లేదు కనుక రాజకీయ పార్టీలు తప్పుగా భావించడం లేదు. ఇప్పుడు పార్టీలన్నీ తమ ఆశయాలను, సిద్దాంతాలను మాటలకే పరిమితం చేసి పూర్తిగా సంకరజాతి రాజకీయ పార్టీలుగా తయారయ్యాయి.
చెరువులో నీళ్ళు నిండగానే అందులోకి బెకబెకమనుకొంటూ కప్పలు వచ్చి చేరడం ఎంత సహజమో అధికారంలో ఉన్న పార్టీలలోకి ప్రతిపక్ష పార్టీల నేతలు వచ్చి చేరడం అంతే సహజమయిపోయింది. కాకపోతే మన రాజకీయ నేతలు తమ నియోజక వర్గం అభివృద్ధి కోసమో లేకపోతే రాష్ట్రాభివృద్ధి కోసమో అధికార పార్టీలో చేరామని చెప్పుకొంటారు. కప్పలు అలాగ చెప్పుకో(లే)వు అంతే తేడా! ఆనం రామనారాయణ రెడ్డి వంటి నేతలయితే మరో అడుగు ముందుకు వేసి తాము భవిష్యత్ తరాల సంక్షేమం (ఎవరి భవిష్యత్ తరాలు?) కోసమే అధికార పార్టీలో చేరాము తప్ప పదవులు అధికారం కోసం కాదని చెపుతారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడుని ఆ పదవిలో నుంచి తప్పించి, ఆనం వారిని ఆస్థాన ఆర్ధిక మంత్రిగా నియమించుకోవాలని బాబుగారు ఆలోచిస్తున్నారుట! ఆయన లెక్కలు ఆయనకీ ఉంటాయి కదా అందుకేనేమో!
ఆనం వారి కంటే చాలా ముందు నుంచే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి క్యూలో నిలబడి ఉన్నప్పటికీ, పార్టీలో నేతలు అభ్యంతరాలు చెపుతున్నందున ఇంకా ఎంట్రీ పాస్ దొరకలేదు. ఆయన లైన్లో వెయిట్ చేస్తుండగానే ఆయన కంటే ముందు మరో కాంగ్రెస్ పెద్దాయన తెదేపా తీర్ధం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారు. ఆయనే గాదె వెంకట రెడ్డి. రాజకీయ ఆచారాల ప్రకారం ఆయన చంద్రబాబు నాయుడు పరిపాలనకు కితాబు ఇచ్చేసారు. అందరూ విమర్శిస్తున్న పట్టిసీమ ప్రాజెక్టుని ‘శబాష్’ అని మెచ్చుకొన్నారు. అందుకు బాబుగారు కూడా చాలా కుష్ అయిపోయారని వినికిడి. కనుక నేడో రేపో ఆయన కూడా రాష్ట్రం కోసం..ప్రజల కోసం తెదేపాలో చేరిపోవచ్చును.
ఆంధ్రాలో అధికారంలో ఉన్న తెదేపా వైపు రాజకీయ నేతల ఫ్లో ఉన్నట్లే తెలంగాణాలో అధికార తెరాసలోకి ఫ్లోటింగ్ ఎక్కువగా కనబడుతోంది. ఇప్పటికే సగం మంది తెదేపా, కాంగ్రెస్ పార్టీ నేతలు తెరాస కండువాలు కప్పేసుకొన్నారు. ఇంకా చాలా మంది క్యూలో నిలబడి వేచి చూస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల వేడిలో మండల స్థాయి నేతలు కార్యకర్తలు కూడా తెరాసలోకి దూకేస్తుంటే వారు మనసు మార్చుకోక ముందే తెరాస నేతలు చకచకా వారికి గులాబీ కండువాలు కప్పేసి లోపలకి లాగేసుకొంటున్నారు. కానీ దానం నాగేందర్ కాంగ్రెస్, తెరాసలలో ఎవరికీ హ్యాండివ్వాలో తెలియక కొంచెం తికమకపడ్డారు. కానీ ప్రస్తుతానికి తెరాసకే హ్యాండిచ్చేరు.
ఇప్పుడు రాజకీయాలు ఎంత అయోమయంగా తయారయ్యాయి అంటే ప్రజలు పొద్దున లేచిన తరువాత, మళ్ళీ రాత్రి పడుకొనబోయే ముందు న్యూస్ చూడకపోతే ఎవరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. పైగా ఇప్పుడు అన్ని పార్టీలలో అన్ని పార్టీలకు చెందిన రాజకీయనేతలు మనకి కనబడుతుంటారు. మనం ఎవరిని వద్దనుకొన్నామో వాళ్ళే మనకు నచ్చిన పార్టీలో కనబడుతుంటారు. ఒకవేళ మనకు నచ్చిన పార్టీకే తప్పనిసరిగా ఓటేయాలనుకొంటే సదరు నేత అవినీతిపరుడు, అసమర్ధుడు అయినా అతనికే ఓటువేయవలసి రావడం మన ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్ప విచిత్రం. ఒకవేళ అతనిని కాదనుకొంటే మనకు నచ్చని పార్టీలో మనకి నచ్చిన వ్యక్తికి ఓటేయవలసి ఉంటుంది. అదీ కష్టమే! కనుక ఈవీఎంలో ‘నోటా’ మీట నొక్కి నిరాశగా వెనక్కి తిరిగి రావలసి ఉంటుంది. ఇంకా ఇంకా ఎంత క్రిందకి దిగజారుతాయో జారగలవో ఎవరికీ తెలియదు. బహుశః మన రాజకీయ నాయకులకి కూడా తెలియదేమో!