తెరాస ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి సంగారెడ్డి అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు రెండున్నరేళ్ల జైలు శిక్ష రూ. 2,500 జరిమానా విధించింది. అతను తన అనుచరులతో కలిసి ఒక పారిశ్రామికవేత్తను బెదిరించి బలవంతంగా రూ. 15 లక్షలకు చెక్కు వ్రాయించుకొన్నట్లు నిరూపించబడటంతో కోర్టు ఈ శిక్ష వేసింది.
హైదరాబాద్ శివార్లలో గల పటాన్‌చెరు పారిశ్రామికవాడలో ఉన్న ఒక కర్మాగారంలో గత ఏడాది మే నెల 5వ తేదీన మహేష్ అనే ఒక కార్మికుడు ప్రమాదంలో మరణించాడు. ఆ సంగతి తెలుసుకొని తెరాస ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తన అనుచరులతో కలిసి అక్కడికి చేరుకొని చనిపోయిన కార్మికుడి కుటుంబానికి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు. ఆ పరిశ్రమ యజమాని చందుకుమార్ అందుకు అంగీకరించారు. మహిపాల్ రెడ్డి అంతటితో ఊరుకోకుండా ఆ కార్మికుడిని చందు కుమారే హత్య చేయించారని వాదిస్తూ ఆయన చేత బలవంతంగా రూ. 15 లక్షలకు చెక్ సంతకం చేయించుకొని తీసుకొన్నారు. ఆయన వెంటనే ఈ విషయం గురించి పోలీసులకు పిర్యాదు చేయడంతో వారు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. పోలీసుల దర్యాప్తులో ఎమ్మెల్యే దోషి అని తేలడంతో న్యాయమూర్తి డి. దుర్గాప్రసాద్ అతనికి రెండున్నరేళ్ళు జైలు శిక్ష, రూ. 2,500 జరిమానా విధించారు. ఆ తీర్పుపై జిల్లా కోర్టులో అప్పీలు చేసుకొనేందుకు గడువుకావాలని మహిపాల్ రెడ్డి అభ్యర్ధించడంతో న్యాయమూర్తి ఆయనకు నెల రోజులు గడువు ఇస్తూ విచారణను జనవరి 6కి వాయిదా వేశారు.
మహిపాల్ రెడ్డి అధికార పార్టీకి చెందినవాడే అయినప్పటికీ ఈ వ్యవహారం ఇంతవరకు వచ్చింది అంటే పార్టీ అధిష్టానం కూడా అతను తప్పు చేసాడని భావిస్తోందని, అందుకే అతనికి సహకరించలేదని అర్ధమవుతోంది. అదే సరయిన పద్ధతి కూడా. ఏపిలో అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని వెనకేసుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది.