దేశంలో మత అసహనం పెరిగిపోతోందని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. మత అసహనం పెరిగిందో లేదో తెలియదు కానీ రాజకీయ అసహనం మాత్రం బాగా పెరిగిపోయిందని ఖచ్చితంగా చెప్పవచ్చును. తమిళనాడు రాష్ట్రంలో అయితే ఈ రాజకీయ అసహనం ఎప్పటి నుండో అమలవుతోంది. ఎవరయినా సాహసించి అధికార పార్టీని విమర్శిస్తే, ఎంతపెద్ద వారయినా సరే అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు. నటుడు కమల్ హాసన్ కూడా అందుకు మినహాయింపు కాదని తమిళనాడు ప్రభుత్వం రుజువు చేసింది. పదిరోజుల క్రితం చెన్నైలో కురిసిన బారీ వర్షాలతో చెన్నై నేటికీ తేరుకోలేకపోతోంది.
“నగరంలో వ్యవస్థలన్నీ కుప్ప కూలాయి. భాదితులకు సహాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయింది. ప్రజలు కట్టిన పన్నులు ఎటు పోతున్నాయో?” అని కమల్ హాసన్ ఆవేదన వ్యక్తం చేసారు. వెంటనే అమ్మగారి వీరభక్త ఆర్ధిక మంత్రి పన్నీర్ సెల్వం ఘాటుగా బదులిచ్చారు. “వరదలలో సహాయం చేయడం అంటే సినిమాలోలాగ ఓ పాటేసుకొని అది పూర్తయ్యేలోగా ఈ ప్రకృతి విపత్తుని సరిదిద్దలేము. కిటికీలో నుండి చూసి నిట్టూర్పులు విడుస్తూ ప్రభుత్వాన్ని విమర్శించే బదులు మిగిలిన నటులలాగ నగరంలోకి వచ్చి చూస్తే పరిస్థితులు ఎలాగా ఉన్నాయో, వాటిని చక్క దిద్దడానికి ప్రభుత్వం ఎంతగా కృషి చేస్తోందో అర్ధమవుతుంది. ప్రజలు కట్టిన పన్నుల లెక్కలను ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసుకోవచ్చని” సవాలు విసిరారు. అంత ఘాటుగా జవాబు వస్తుందని ఊహించని కమల్ హాసన్ చాలా కంగారుపడి సంజాయిషీ, దానితో బాటే క్షమాపణలు కూడా చెప్పుకొన్నారు. కానీ అమ్మ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు జారారు కనుక మూల్యం చెల్లించక తప్పలేదు.
ఆల్వార్ పేటలోని ఎల్డం రోడ్డులో ఉన్న ఆయన కార్యాలయానికి, దానితోబాటే చుట్టుపక్కల నివసిస్తున్న ఇళ్ళకి సుమారు పది రోజులు పవర్ కట్ అయిపోయింది. కానీ అందరూ అనుకొంటున్నట్లు కమల్ హాసన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించినందువల్ల మాత్రం కాదని విద్యుత్ శాఖ అధికారులు చెపుతున్నారు. ఆ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఒకటి పాడయిపోయిందని, అక్కడ నీళ్ళు నిలిచిపోవడంతో ఇన్నాళ్ళు రిపేరు చేయడం సాధ్యం కాలేదని చెప్పారు. కనుక మళ్ళీ విద్యుత్ కేబులో, నీళ్ళ గొట్టమో లేక మరొకటో పాడయిపోకుండా కమల్ హాసన్ జాగ్రత్త పడటం మంచిది లేకుంటే ఆయన వలన చుట్టుపక్కల ఉన్నవాళ్ళకి బాధలు తప్పకపోవచ్చును.