ముంబై 26/11 పాక్ ఉగ్రవాదుల దాడులకి కుట్ర పన్నినవారిలో ఒకడయిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ ప్రస్తుతం అమెరికాలో జైల్లో ఉన్నాడు. అతనికి ఆ కేసులో అమెరికా కోర్టు 35సం.ల జైలు శిక్ష విధించింది. అమెరికాకు చెందిన అతను పాక్ లోని లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థ కోసం పనిచేసాడు. ముంబైలో దాడులు జరుపడడం కోసం అతను 2007 సం.లో ఒకసారి, మళ్ళీ 2008సం.లో మరోసారి ముంబైలో పర్యటించి దాడులు చేయవలసిన ప్రాంతాలను, అక్కడికి చేరుకొనే మార్గాలను వగైరా అన్ని వివరాలు వీడియో సహితంగా ఉగ్రవాదులకు అందజేశాడు. అతను అందించిన ఆ సమాచారాన్ని పాక్ ఉగ్రవాదులు ఉపయోగించుకొని ముంబైలో ఒకేసమయంలో వివిధ ప్రాంతాలలో చేసిన దాడులలో అనేక వందల మంది పౌరులు మరణించారు. వందల మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఆ సంఘటన జరిగిన తరువాత భారత్ విదేశాంగ శాఖ చొరవతో ఈ కేసు విషయంలో డేవిడ్ హీడ్లీని ప్రశ్నించేందుకు నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ (ఎన్.ఎస్.ఏ) అధికారులను అమెరికా ప్రభుత్వం అనుమతించింది. ఆ తరువాత మళ్ళీ నేటి వరకు ఆ కేసులో ఎటువంటి పురోగతి లేదు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భారత్-అమెరికా దేశాల మధ్య సంబంధాలు బలపడటంతో డేవిడ్ హెడ్లీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిన్న ముంబై కోర్టు విచారించగలిగింది.
ఆ సందర్భంగా అతను తన నేరాన్ని అంగీకరించి, ఈ కేసులో తన పాత్ర గురించి, ఈ కుట్రలో పాల్గొన్న వారి గురించి, ఈ కుట్రకు సంబంధించిన అన్ని విషయాలను చెప్పడానికి సిద్దంగా ఉన్నానని కనుక తనను క్షమించి ఈ కేసులో “అప్రూవర్” గా భావించవలసిందిగా కోర్టును అభ్యర్ధించాడు. కొన్ని షరతులతో కోర్టు అందుకు అంగీకరించింది. కానీ అతనికి అమెరికా కోర్టు 35సం.ల జైలు శిక్ష విధించింది కనుక అతనిని భారత్ తీసుకురావడం సాధ్యం కాకపోవచ్చును. అయితే అతనిని భారత్ తీసుకురాలేకపోయినప్పటికీ ఈ కేసు విచారణకు అమెరికా ప్రభుత్వం సహకరించి, అతనిని అవసరమయినప్పుడల్లా ఇదేవిధంగా వీడియో కాన్ఫరెన్స్ పద్ధతి ద్వారా భారత్ లోని కోర్టు ముందు హాజరు పరచడానికి అంగీకరించినట్లయితే, ఈ ముంబై 26/11 దాడుల కేసు ఇంతవరకు తెలియని కొత్త విషయాలు, ఈ దాడిలో పాల్గొన లేదా సహకరించిన దేశంలోపల బయట వ్యక్తుల వివరాలు అన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.