హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేయటం లేదంటూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, ఎర్రబెల్లి సుప్రీమ్ కోర్ట్‌ను ఆశ్రయించారు. ఈ కేసు ఇవాళ సుప్రీమ్ కోర్ట్‌లో విచారణకు వచ్చింది. ఏడుగురు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి చేరారని, ఇది జరిగి 14 నెలలు గడుస్తున్నా స్పీకర్ వారిపై అనర్హత వేటు వేయటంలేదని, వారిలో కొందరు మంత్రిపదవులుకూడా చేపట్టారని టీడీపీ, కాంగ్రెస్ పార్టీల తరపు న్యాయవాదులు వాదించారు. స్పీకర్‌కు కాలపరిమితి విధించాలని కోర్టును కోరారు. కోర్ట్ దీనిపై స్పందిస్తూ, విషయం స్పీకర్ పరిధిలో ఉన్నందున తాము జోక్యం చేసుకోలేమని, అయినా కూడా స్పీకర్‌కు మరో రెండు నెలలు సమయం ఇస్తామని పేర్కొంది. ఈ రెండు నెలల్లో కూడా స్పీకర్ ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్య తీసుకోకపోతే కేసు విచారణ చేపడతామని తెలిపింది. తెలుగుదేశంనుంచి తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు, ధర్మారెడ్డి, సాయన్న టీఆర్ఎస్లోకి చేరిన సంగతి తెలిసిందే. వీరిలో తలసాని మంత్రిపదవిని కూడా అలంకరించారు.