హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారాజధాని ముసుగులో పెద్ద కుంభకోణం జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. బొత్స ఇవాళ హైదరాబాద్‌లో తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, సీమాంధ్ర స్కాముల రాష్ట్రంగా మారుతోందని అన్నారు. రాష్ట్రంలో పంచభూతాలను కూడా కబ్జా చేస్తున్నారని, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలు నష్టదాయకమని, ఆ కంపెనీలకు ఏ ప్రాతిపదికన భూములు ఇస్తారని అడిగారు. వేల ఎకరాల భూమిని సింగపూర్‌కు దోచిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సింగపూర్ సంస్థలకు భూముల ప్రతిపాదనలను తాము గతంలోనే వ్యతిరేకించామని గుర్తు చేశారు. ఇసుక నుంచి ప్రతిదీ కుంభకోణాలమయంగా మారిందని విమర్శించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టర్లనుంచి అడ్డగోలుగా దోచుకోవటానికి అవకాశం కల్పించే జీవో నంబర్ 22 ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా అయినవారి చేతుల్లో పోస్తోందని ఆరోపించారు. పట్టిసీమ ప్రాజెక్ట్‌పై ప్రభుత్వం శ్రద్ధ చూపించటానికి కారణం కూడా ఈ జీవోయేనని బొత్స అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా బాక్సైట్ తవ్వకాలపై జారీచేసిన జీవో నంబర్ 97ను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.