హైదరాబాద్ సరోజిని దేవి కంటి ఆస్పత్రిలో కేవలం నీళ్లు సరఫరా కాకపోవడం వల్ల ఆపరేషన్లు నిలిచిపోయాయి. హటాత్తుగా వచ్చిన సమస్య అయితే ఎవరేం చేస్తార్లే అనుకోవచ్చు. మూడు రోజులుగా ఇదే తంతు. గోదావరి నీటి పేరుతో మురికి నీరు సరఫరా కాకపోవడంతో ఆపరేషన్లు జరగడం లేదు. ఇలా 180 మంది రోగులకు చేయాల్సిన ఆపరేషన్లు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి.
పైప్ లైన్లో సమస్య ఉంటే వెంటనే సరిచేయాలి. అది ఆలస్యం అవుతుందనుకుంటే కనీసం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి, పేద రోగుల ఆపరేషన్లకు ఆటంకం లేకుండా చూడాలి. కానీ ఆస్పత్రి వైద్యాధికారులు గానీ, ప్రభుత్వ పెద్దలు గానీ ఆ పని చేయడం లేదు. మూడు రోజుల పాటు ఓ చిన్న కారణం వల్ల పేదలు ఆపరేషన్లు జరగక పడిగాపులు పడాల్సి రావడం దారుణం.
సంక్షేమంలో నెంబర్ వన్ అని చెప్పుకొనే కేసీఆర్ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందని ఇప్పటికే విమర్శలున్నాయి. ఇప్పుడు ఈ ఘటన జరిగినా ప్రభుత్వం స్పందించలేదంటే విపక్షాల ఆరోపణలు నిజమే అనుకోవాల్సి వస్తుంది. రాజధానిలోని నేత్ర వైద్యశాలలో ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నా వైద్య ఆరోగ్య మంత్రి ఏం చేస్తున్నారో అర్థం కాదు. వైద్య మంత్రి లక్ష్మారెడ్డి పేదల ఆరోగ్యం గురించి తీసుకునే చర్యలేమిటో ఎవరికీ అంతు పట్టవు. ఇంత పెద్ద సమస్యను పరిష్కరించడం కన్నా ఆయనకు ముఖ్యమైన పనులు మూడు రోజులుగా ఏమున్నాయో అర్థం కాదు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మరి ఇక్కడున్న మంత్రులు ప్రజలను పట్టించుకోరా అనేది ప్రజల ప్రశ్న.
కేసీఆర్ ప్రభుత్వ ప్రాధాన్యాలపై మొదటి నుంచీ ఆరోపణలున్నాయి. మిషన్ కాకతీయ, జలహారం, డబుల్ బెడ్ రూం ఇళ్లు వంటివి మినహాయిస్తే, మిగతా అంశాల్లో ప్రభుత్వ పనితీరు అనేక సార్లు ప్రజా వ్యతిరేకంగా కనిపిస్తుంది. ముఖ్యంగా, బాగా డబ్బులున్న వారికి సహాయం పేరుతో ప్రజాధనాన్ని వృథా చేయడం, పేదల విషయానికి వచ్చే సరికి నిర్లక్ష్యం చేయడం మామూలూపోయింది. సఫాయి కార్మికులను కర్కశంగా తొలగించినప్పుడే ప్రభుత్వ వైఖరి మరోసారి బయటపడింది. ఓ వైపు పేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి, మరోవైపు ఎన్ని యాగాలు చేస్తే ఏంటనేది సామాన్యుల ప్రశ్న. దీనికి కేసీఆర్ ప్రభుత్వం ఏం జవాబు చెప్తుందో?