తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ, తెదేపా, వైకాపాలకు చెందిన అనేకమంది నేతలు అధికార తెరాస పార్టీలోకి దూకేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యామాని అది ఇంకా వేగం పుంజుకొందిపుడు. పార్టీలు మారిదలచినవారు ముందుగా తమ పార్టీ ద్వారా సంపాదించుకొన్న ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి, మారినట్లయితే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ, తెదేపాల ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ తెరాసలో పనిచేస్తుండటమే చాలా ఎబ్బెట్టుగా ఉంది. కానీ సదరు నేతలు అందుకు ఏమాత్రం సిగ్గుపడటం లేదు. నిత్యం నైతిక విలువల గురించి మాట్లాడే తెరాస కూడా దానిని తప్పుగా భావించడం లేదు.
ఈ వ్యవహారంపై తెదేపా, కాంగ్రెస్ పార్టీ నేతలు మొట్టమొదట స్పీకర్ మధుసూదనాచారిని, ఆ తరువాత గవర్నర్ నరసింహన్ ని కలిసి పిర్యాదు చేసారు. కానీ ఫలితం లేదు. ఆ తరువాత హైకోర్టుని ఆశ్రయించారు. కానీ అది స్పీకర్ పరిధిలో ఉన్న అంశం కనుక తాము స్పీకర్ ని ఆదేశించాలేమని హైకోర్టు తన నిసహాయత వ్యక్తం చేసింది. తెదేపా, కాంగ్రెస్ పార్టీ నేతలు వేసిన పిటిషన్ పై నేడు విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కూడా అదేవిధంగా తన నిసహాయత వ్యక్తం చేయడంతో రాజకీయ వ్యవస్థలో ఈ వంకరను సరిచేసే మార్గమే లేకుండాపోయింది.
ఈ వ్యవహారంపై స్పీకర్ రెండు నెలలో తగిన చర్యలు తీసుకొంటారని ఆశిస్తున్నామని లేకుంటే అప్పుడు ఈ కేసును పునర్విచారిస్తామని సుప్రీం కోర్టు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉంది కనుక తను జోక్యం చేసుకోలేనని సుప్రీం కోర్టు భావిస్తున్నట్లయితే అదే విషయం స్పష్టంగా చెప్పవచ్చును. స్పీకర్ ని తను ఆదేశించగలనని భావిస్తున్నట్లయితే తక్షణమే ఆయనకి నోటీసులు పంపి సంజాయిషీ కోరవచ్చును. కానీ రెండు నెలల గడువు పెట్టడం దేనికో అర్ధం కాదు. బహుశః సుప్రీం కోర్టు విజ్ఞప్తిని మన్నించి స్పీకర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదిస్తారని భావిస్తోందేమో? ఏడాదిన్నర కాలంగా స్పందించని స్పీకర్ రెండు నెలలో స్పందిస్తారని ఆశించడం అత్యసే అవుతుంది.