సోషల్ నెట్ వర్క్ దిగ్గజం `ఫేస్ బుక్’ 2015 సంవత్సరంలో జరిగిన ప్రధాన సంఘటనలను క్రోడీకరించి రెండు నిమిషాల రెండు సెకన్ల నిడివితో ఒక వీడియోని రిలీజ్ చేసింది. ప్రపంచ ప్రజలను కదిలించి, మెప్పించిన సంఘటనలతో పాటుగా బాహుబలి చిత్రంలోని తమన్నాని ఈ వీడియోలో క్షణకాలం చూపించారు.
`అవంతిక’ ఇది బాహుబలి జానపద చిత్రంలోని ఒక కథానాయక పేరు. ఆ పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా లీనమై నటించింది. తన అందచందాలను ఆరబోస్తూ ఎక్కడో కొండలు, జలపాతాల క్రింద కుగ్రామంలో నివసించే శివుడు (ప్రభాస్) అనే యువకుడ్ని ప్రేమపూరిత ఆకర్షణతో తన దగ్గరకు తెచ్చుకుంటుంది. ఈ సన్నివేశాన్ని డైరెక్టర్ రాజమౌళి అత్యంత అద్భుతంగా చిత్రీకరించారు. ఎత్తైన పర్వతాలు, ఆకాశగంగలా దివినుండి భువికి వడిగా జాలువారే జలపాతాలు, వాటి మధ్యలో స్వర్ణాభరణ భూషితై, తెల్లటి దుస్తులు ధరించి చెంగుచెంగున దూకుతూ, వేగంగా సాగుతూ, దేవకన్యలా కనిపించే అవంతిక…. ఇదీ సన్నివేశం. ఈ దృశ్యాలను సిజిఎస్ ఎఫెక్ట్స్ (కంప్యూటర్ జనరేటెడ్ ఇమాజెరీ ఎఫెక్ట్స్) తో అత్యంత సుందరంగా రాజమౌళి తెరకెక్కించారు. ఈ `మనోహరి’ ఇప్పుడు ఫేస్ బుక్ 2015 రివ్యూ వీడియోలో చోటుసంపాదించుకుంది.
2015లో బాహుబలితోపాటుగా సల్మాన్ ఖాన్ భజరంగి భాయ్ జాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, షారూక్ ఖాన్ `దిల్ వాలె’ వంటి సినిమాలు ఉండగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తీసిన బాహుబలి సినిమాలోని తమన్నా దృశ్యం ఫేస్ బుక్ 2015 రివ్యూ వీడియోలో చోటుచేసుకోవడం తమన్నా అభిమానులకు నిజంగా పండుగే. రెండు పార్ట్ లుగా ప్రేక్షకులకు అందిస్తున్న బాహుబలి మొదటి బాగం 2015లో రిలీజ్ అయింది. చిత్రకథ బాహుబలి (ప్రభాస్) చుట్టూ తిరుగుతుంటుంది. పార్ట్ 1తోనే ప్రభాస్ వరల్డ్ ఫేమస్ హీరో అయ్యాడు. అయినప్పటికీ చిత్రమేమంటే, బాహుబలి సినిమాలోని తమన్నాపై చిత్రీకరించిన దృశ్యమే ఫేస్ బుక్ రివ్యూ వీడియోలో చోటు దక్కించుకోగలగడం.
2015లో ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రముఖ సంఘటనలను మాలగా గుచ్చి ఫేస్ బుక్ ఈ వీడియోని సిద్దం చేసింది. పారిస్ ఉగ్రవాది దాడి ఘటన, సిరియా వలసవాదుల వెతలు వంటి సంఘటనలతో పాటుగా విశేషంగా చర్చకు దారితీసిన అమ్మాయి డ్రెస్ రంగులు (కొందరికి బ్లూ అండ్ బ్లాక్ గానూ, మరికొందరికి వైట్ అండ్ గోల్డ్ కలర్ లోనూ కనిపించడం), 14ఏళ్ల స్కూల్ విద్యార్థి అహ్మద్ మహ్మద్ తెలివితేటలకు అమెరికా అధ్యక్షుడు అబ్బురపడటం, సింగపూర్ స్వర్ణోత్సవ సంబరం, సూపర్ మూన్ వంటి సంఘటనల మధ్యలో వీడియో నిడివిలోని 1.13 (ఒక నిమిషం 13వ సెకన్ వద్ద) తమన్నా హఠాత్తుగా ఓ దేవకన్యకగా దర్శనమిస్తుంది. తమన్నా అభిమానులకేకాక, బాహుబలి యూనిట్, భారతీయ చలనచిత్ర అభిమానులకు ఇది నిజంగా పండుగే మరి. Facebook 2015 Year in Review – Story of the Year (https://www.youtube.com/watch?v=OEzyex2HvqA ) ద్వారా ఈ వీడియోని తిలకించవచ్చు.
– కణ్వస