నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి త్వరలో కోర్టు విచారణను ఎదుర్కోబోతున్నారు. ఆ కేసు వారి వ్యక్తిగత సమస్యే తప్ప అది దేశ ప్రజల సమస్య కాదు. అ కేసుతో పార్లమెంటుకి ఎటువంటి సంబందమూ లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్లుగా మోడీ ప్రభుత్వం తమపై కక్ష సాధింపుకు పాల్పడుతోందనుకొంటే, దానిని ఎదుర్కొనేందుకు పార్లమెంటు వేదిక కాదు. పార్లమెంటు ఒక చట్ట సభ. అందులో ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టాలలో లోటు పాట్లపై క్షుణ్ణంగా చర్చించి వాటిలో లోపాలున్నట్లయితే సరిచేసి ఆమోదించవలసి ఉంటుంది. ప్రజా సమస్యలపై చర్చించి వాటికి సరయిన పరిష్కారాలు కనుగొనాలి. కానీ సోనియా, రాహుల్ గాంధీల సమస్యల గురించి పార్లమెంటులో చర్చించనవసరంలేదు. ఈ చిన్న విషయం మరిచిపోయి కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ కేసులో పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేస్తోంది. ఇంతవరకు ఓపికగా వేచి చూసిన బీజేపీ ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే వైఖరి అవలంభిస్తుందని గ్రహించిన తరువాత అది కూడా కాంగ్రెస్ పార్టీని కట్టడి చేసేందుకు తగిన వ్యూహం అమలు చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసు ఎప్పుడు ఏవిధంగా మొదలయింది…దానికి కారణాలు ఏమిటి? దానిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధిల పాత్ర ఏమిటి? వారిని కోర్టు ఎందుకు దోషులుగా భావిస్తోంది? అందులో డబ్బు ఏవిధంగా చేతులు మారింది? చివరికి ఆ డబ్బు ఎక్కడికి చేరుకొంది…వంటి పూర్తి వివరాలతో ఒక చిన్న పుస్తకాన్ని అచ్చు వేసి పార్లమెంటులో ఎంపీలకు పంచిపెట్టింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కాపాడుకోవడం కోసమే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సమావేశాలను స్తంబింపజేస్తోందని ఎదురు దాడి చేయడం మొదలుపెట్టింది. దానితో కాంగ్రెస్ పార్టీ మాట మార్చి తాము వేరే ఇతర కారణాలతో పార్లమెంటును స్తంభింపజేస్తున్నామని చెప్పుకొంటోందిపుడు. కానీ పార్లమెంటును స్తంభింపజేయక మానమని స్పష్టం చేస్తోంది. మోడీ ప్రభుత్వాన్ని దెబ్బ తీసే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరి వలన చివరికి కాంగ్రెస్ పార్టీకే నష్టం కలగవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.