ఇసుకే బంగారమాయెనే అనుకోనవసరంలేదు…ఇక రోబో ఇసుకతో కూడా నిర్మాణాలు పూర్తి చేసుకోవచ్చు. నిర్మాణరంగంలో డిమాండ్ కు, ఇసుక అందుబాటుకూ పొంతనేలేదు. రెండున్నర కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరంకాగా నదులు, ఏర్లు, వాగుల్లో అందుబాటులో వున్న ఇసుక కోటి క్యూబిక్ మీటర్లలోపే…గోదావరి బెడ్ లెవెల్ ని శుభ్రం చేయడానికి డ్రెడ్జింగ్ చేయడం ద్వారా మరో 60 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తీయవచ్చని అంచనా వేశారు. అయినా కోటి క్యూబిక్ మీటర్ల ఇసుక కు కొరత తప్పదు
రోబో ఇసుక ఉత్పత్తి చేయడం ద్వారా ఇసుక లోటుని నివారించాలన్ని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రోబోశాండ్ అంటే రాళ్ళను పిండి చేయడమే! వానలు ముంచెత్తడం వల్లో, గాలులకు చెట్లు కూలిపోవడం వల్లో కొండవాలుల్లో మట్టి జారి, బండలు దొర్లుకుంటూ వాగుల్లో నదుల్లో చేరిపోతాయి. వందల సంవత్సరాల నీటి ఒరవడికి రాళ్ళు, బండలు అరిగిపోయి నప్పటి దుమ్మూ, ధూళీ రివర్ బెడ్ మీద మెత్తటి ఇసుక గా పేరుకుపోతోంది.
ప్రకృతి సృష్టించే ఇసుకకు నీరే మూలం..బండరాళ్ళనుంచి రాబ్ శాండ్ చేయడానికి యంత్రాలే ఆధారం. రాళ్ళను గరుకైన పొడిగా మార్చి ఫ్యాక్టరిలో ప్రాసెస్ చేయడమే రోబో శాండ్! మరీ మెత్తగానూ మరీదృఢంగానూ వుండని రాళ్ళు ఈ ఇసుకకు శ్రేష్టమని చెబుతున్నారు. గ్రానైట్, రోడ్ మెటల్ తయారీలో వెలువడే రద్దు రాళ్ళు, ముక్కలు రాబోశాండ్ కి వనరులు.
ఇసుక డిమాండ్ బాగావున్న ముంబాయి, కోల్ కత్తా నగరాల్లో నిర్మాణాలకు ఇప్పటికే రాబోశాండ్ ఉపయోగిస్తున్నారు. పైగా ఇది మామాలు ఇసుక కంటే ఈ ఇసుక ధర కూడా తక్కువేనట!
రాబో ఇసుక ఉత్పత్తి లేదా ప్రాసెసింగ్ యూనిట్ల వల్ల ఉపాది అవకాశాలు పెరుగుతాయి కూడా. ఈ ఇసుక తీయడానికి అనుకూలమైన రాళ్ళు ఉత్తర కోస్తా జిల్లాల్లో హెచ్చుగా వున్నాయి. ఈ ప్రాంతంలో రాబోశాండ్ ఫ్యాక్టరీల స్ధాపనను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం 2015 పారిశ్రామిక విధానంలో పొందుపరచింది.
రాబోశాండ్ సురక్షితమైనదేనన్న నమ్మకాన్ని ప్రజల్లో చూపించడానికి విశాఖ పట్టణంలో ప్రభుత్వ భవనాలను రాబోశాండ్ తో నిర్మించాలని కూడా నిర్ణయించారు.