కల్తీ మద్యం కేసులో నిందితుడుగా పేర్కొనబడిన విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లాది విష్ణు గత మూడు రోజులుగా పోలీసులకు కనబడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఆయన హైదరాబాద్ లో ఉన్నట్లు పోలీసులు కనుగొనడంతో విజయవాడ నుండి రెండు పోలీస్ బృందాలు ఆయనని అదుపులో తీసుకోవడానికి ఈరోజు హైదరాబాద్ బయలుదేరి వెళుతున్నారు. హైదరాబాద్ నగర పోలీసుల సహాయంతో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆయనతో బాటు ఆయన తల్లి, మరో 8 మందిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసారు. వారిలో స్వర్ణా బార్ అండ్ రెస్టారెంట్ సిబ్బందిని ఇప్పటికే అరెస్ట్ చేసారు. మిగిలినవారిని స్టేషన్ కి రమ్మని ఆదేశాలు జారీచేసినా ఎవరూ హాజరు కాకపోవడంతో వారిపై తదుపరి చర్యలు చేపట్టేందుకు పోలీసులు సిద్దం అవుతున్నారు. మద్యం మత్తు మరింత పెరిగేందుకు మద్యంలో ఒక రసాయనం కలిపినట్లు బార్ సిబ్బంది పోలీసుల ముందు అంగీకరించినట్లు సమాచారం. కానీ దాని వలన మద్యం విషంగా మారి ఒకేసారి 5మంది మరణించారు. ఆ మద్యం సేవించిన మరికొందరికి కళ్ళు, కిడ్నీ, మెదడు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందరికీ విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు.