ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార తెరాస పార్టీ ఇంతవరకు ఆరు సీట్లు ఏకగ్రీవంగా గెలుచుకొంది. వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో ఒక్కొక్క సీటు, కరీంనగర్ లో రెండు సీట్లు గెలుచుకొంది. ఆ జిల్లాలలో పోటీలో ఉన్న తెదేపా, కాంగ్రెస్ పార్టీల మరియు స్వతంత్ర అభ్యర్ధులు పోటీ నుండి విరమించుకొని తెరాసలో చేరిపోతుండటం విశేషం. తమ పార్టీల అభ్యర్ధులని, ఎంపిటిసిలని తెరాస నయాన్నో భయాన్నో లొంగదీసుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని తెదేపా, కాంగ్రెస్ పార్టీ నేతలు తెరాస మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదన్నట్లు తెరాస వ్యవహరిస్తోందని కె. జానారెడ్డి విమర్శించారు.
వరంగల్ నుంచి కొండా మురళి అందరికంటే మొట్టమొదట ఎమ్మెల్సీ సీటు గెలుచుకొన్నారు. ఆ తరువాత మెదక్ నుండి భూపాల్ రెడ్డి, ఆదిలాబాద్- పురాణం సతీష్, నిజామాబాద్-భూపతి రెడ్డి, కరీంనగర్ లో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాద్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజుతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. కనుక మిగిలినవారు ఎన్నికలలో పోటీపడక తప్పదు. కానీ తెరాస జోరు చూస్తుంటే మిగిలిన ఆరు స్థానాలలో ఎంపీటీసీలను తనవైపు తిప్పుకొని వాటిని కూడా కైవసం చేసుకొనే అవకాశం కనబడుతోంది. అదే జరిగితే ఇక ఎన్నికలు, ఫలితాలు అన్నీ లాంచనప్రాయమే అవుతాయి.