తెదేపా సీనియర్ నేత విజయరామారావు నిన్న పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎటువంటి విభేదాలు లేవు. పార్టీని వీడటానికి బలమయిన కారణాలు కూడా ఏమీ లేవు. కానీ తెరాసలో చేరాలని నిశ్చయించుకొన్నందునే ఏదో చిన్న సమస్యని చూపి పార్టీ వీడుతున్నారని తెదేపా నేతలు అంటున్నారు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయనతో మాట్లాడినా ఆలోచించుకొని చెపుతానని జవాబిచ్చారు తప్ప పార్టీలో కొనసాగుతానని అనకపోవడం గమనిస్తే ఆయన తెరాసలో చేరేందుకే పార్టీని వీడుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఈరోజు మంత్రి కె. తారక రామారావు వచ్చి ఆయనని కలిసి తెరాసలోకి ఆహ్వానించారు. రెండు రోజుల్లో తన నిర్ణయం చెపుతానని హామీ ఇచ్చేరు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి బాగా కృషి చేస్తున్నారని, హైదరాబాద్ అభివృద్ధి కోసం బాగా కృషి చేస్తున్నారని, తెరాసతో తప్పకుండా కలిసి పనిచేస్తానని అన్నారు. కనుక ఆయన తెరాసలో చేరబోతున్నట్లు చాలా స్పష్టంగానే చెప్పినట్లు భావించవచ్చును. ఆయన కుమార్తె అన్నపూర్ణకు కూడా తెరాసలో సముచిత స్థానం కల్పిస్తామని కేసీఆర్ తరపున కె. తారక రామారావు హామీ ఇచ్చేరు. బహుశః ఒకటి రెండు రోజుల్లోనే ఆయన తెరాసలో చేరవచ్చని సమాచారం.