హైదరాబాద్: కాల్‌మనీ రాకెట్లో తన పాత్ర ఉందని తేలితే ఏ శిక్షకైనా సిద్ధమని తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఇవాళ విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాలు హుందాగా చేయాలని ప్రతిపక్షాల నేతలకు సూచించారు. కాల్‌మనీ వ్యవహారంలో తనకు ప్రమేయం ఉందన్న అసత్యప్రచారాలను, బురద జల్లుడును తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉందని చెబుతున్న తన అన్న బుద్దా నాగేశ్వరరావుకు, తనకు మధ్య సత్సంబంధాలు లేవని అన్నారు. ఎప్పుడైనా శుభకార్యం ఏదైనా ఉంటే వెళ్ళటం తప్ప ఆయనకు తనకు మధ్య పెద్దగా సంబంధాలు లేవని చెప్పారు. ఆయనపై ఎలాంటి చర్య తీసుకున్నా తాను జోక్యం చేసుకోనని అన్నారు. తనకు గానీ, తన సోదరుడికి గానీ ఎవరైనా డబ్బులివ్వాల్సి ఉన్నా ఇవ్వొద్దని చెప్పారు.
ఈ కేసులో ఎవరు కేసులుపెట్టినా వారి నోట్లు, చెక్కులు చించేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కుపాదం పెట్టి ఈ వ్యాపారాన్ని అణచేస్తారని చెప్పారు. విజయవాడలో కాల్‌మనీ వ్యాపారం జరగదని అన్నారు. చంద్రబాబు ఎవరినీ ఉపేక్షించరని అన్నారు. ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తిగా విజయవాడలో తాను ఎదుగుతున్నానని, అరాచక శక్తులను అడ్డగిస్తున్నానని ఓర్వలేక, రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక ఇలా బురద జల్లుతున్నారని ఆరోపించారు. తనకు ప్రమేయం ఉంటే ఇలా ప్రెస్ మీట్ పెట్టానని బుద్దా వెంకన్న అన్నారు.