వైఎస్ఆర్ గా ప్రజాబాహుళ్యంలో వాడుకలో ఉన్న యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి 2004 మే నుంచి 2009 సెప్టెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1949 జులై 8న కడపజిల్లా జమ్మలమడుగులో జన్మించిన వైఎస్ 1972లో గుల్బర్గా యూనివర్సిటీనుంచి ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్నారు. కళాశాలస్థాయినుంచే రాజకీయాలపై ఆసక్తి కనబరిచిన ఆయన 1978లో పులివెందులనుంచి తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ వెంటనే మంత్రిపదవికూడా దక్కించుకున్నారు. అప్పటినుంచి చనిపోయేవరకు పునివెందులనుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా, కడపనుంచి నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. 1978నుంచి పలుసార్లు మంత్రిగా పనిచేసినప్పటికీ వైఎస్ కు ముఖ్యమంత్రి పదవిపైనే దృష్టి ఉండేది. 1999లో ప్రతిపక్షనేతగా ఉంటూ తదుపరి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2003లో మండువేసవిలో ఆయన చేసిన భారీ పాదయాత్ర, నిత్య అసంతృప్తివాదిగా ఆయనపై అప్పటివరకు ఉన్న ముద్రను చెరిపేసి బ్రహ్మాండమైన ప్రజాదరణను సంపాదించిపెట్టింది. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో వైఎస్ కీలకపాత్ర పోషించారు. దీంతో ముఖ్యమంత్రి పదవి ఆయనకే దక్కింది.
ఆరోగ్యశ్రీ, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ళు, కిలో రెండురూపాయల బియ్యంవంటి పలు సంక్షేమ పథకాలను వైఎస్ ప్రవేశపెట్టారు. ఇక భారీఎత్తున చేపట్టిన జలయజ్ఞం నిర్మాణం పెద్దఎత్తున వివాదాస్పదమయింది. జలయజ్ఞం కాంట్రాక్టులలో భారీ ఆవినీతి జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వంతో పనులు చేయించుకోవటానికి, వివిధ రూపాలలో లబ్దిపొందటానికి పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు వైఎస్ కుమారుడు జగన్ కు చెందిన వ్యాపారసంస్థలలో పెట్టుబడులు పెట్టినట్లు ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి.
ఇంత ప్రచారం జరిగినాకూడా 2009 ఎన్నికలలో కాంగ్రెెస్ పార్టీని వైఎస్ ఒంటిచేత్తో విజయపథాన నడిపించారు. దీంతో మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అదే సంవత్సరం సెప్టెంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
వైఎస్ భార్య విజయలక్ష్మి ప్రస్తుతం వారి కుమారుడు జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలిగా ఉన్నారు. వైఎస్ కుమార్తె షర్మిలకూడా అదేపార్టీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.