ముంబైకి చెందిన ప్రముఖ చిత్రకారిణి హేమా ఉపాద్యాయ్ (45), ఆమె లాయరు హరీష్ భూషణ్ (65)లు దారుణంగా హత్యచేయబడ్డారు. నిన్న సాయంత్రం 7.30 గంటలకు ఖాండివిల్లి అనే ప్రాంతంలో ఒక మురికి కాలువలో రెండు శవాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు తక్షణమే అక్కడికి చేరుకొని ఆ శవాలను స్వాధీనం చేసుకొని పోస్ట్ మార్టం కోసం తరలించారు. అవి హేమా ఉపాద్యాయ్, ఆమె లాయరు హరీష్ భూషణ్ శవాలుగా పోలీసులు గుర్తించారు. హేమా ఉపాద్యాయ్ కి ఆమె భర్త చింతన్ ఉపాద్యాయ్ తో గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆమె తన భర్త నుండి విడిపోయేందుకు 2013లో కోర్టులో కేసు వేసింది. ముంబై సమీపంలోని మాటుంగ అనే ప్రాంతంలో నివసిస్తున్న లాయరు హరీష్ భూషణ్ ఆమె తరపున కోర్టులో వాదిస్తున్నారు. వారిరువురు హత్యకు గురి కావడంతో సహజంగానే పోలీసులు ఆమె భర్త చింతన్ ఉపాద్యాయ్ నే అనుమానిస్తున్నారు. హత్య జరిగిన తరువాత అతను కనబడకపోవడంతో ఆ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఖాండివిల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.