ఇదివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాల మధ్య యుద్దవాతావరణం నెలకొని ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచు ఒకమాట చెప్పేవారు. “పార్టీల పని పార్టీలు చేసుకుపోనిద్దాం. ప్రభుత్వాలుగా సహకరించుకొందాం,” అని చెప్పేవారు. కానీ అది సాధ్యమని అప్పుడు ఎవరూ అంగీకరించలేదు. తెలంగాణాలో తెదేపా నేతలు తెరాస ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తూ యుద్ధం చేస్తుంటే, అదేమీ పట్టించుకోకుండా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, చంద్రబాబు నాయుడుతో ఏవిధంగా సహకరిస్తారు? ఎందుకు సహకరించాలి? అనే సందేహం అందరిలో వ్యక్తం అయింది. కానీ ఊహించని ఆ పరిస్థితే కనబడుతోందిపుడు.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణాలో తెదేపా నేతలని, ప్రజా ప్రతినిధులని తన పార్టీలోకి ఆకర్షిస్తూ తెదేపాను ఖాళీ చేసేస్తూనే, అదేమీ తెలియనట్లుగా తను చేయబోయే చండీయాగానికి చంద్రబాబు నాయుడుని ఆహ్వానించడానికి నేడు విజయవాడ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన ఆ సూత్రాన్ని ఆయన బాగానే ఆకళింపు చేసుకొని చాలా చక్కగా ఆచరణలో పెడుతున్నారని చెప్పవచ్చును. చంద్రబాబు నాయుడు స్వయంగా పార్టీల పరంగా ఎలాంటి రాజకీయాలు జరిగినా వాటిని పట్టించుకోకుండా ప్రభుత్వాల పరంగా సహకరించుకొందామని చెప్పారు కనుక ఇప్పుడు కేసీఆర్ ని నిలదీసి ప్రశ్నించలేని పరిస్థితి చేజేతులా కల్పించుకొన్నారు.
కేసీఆర్ తో స్నేహం నిలుపుకోవడం కోసం ఆయన తెలంగాణా తెదేపా వ్యవహారాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకోవడం వలననే ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పవచ్చును. కేసీఆర్ తో స్నేహం కోసం చంద్రబాబు నాయుడు తన స్వంత పార్టీనే పణంగా పెట్టుకొన్నట్లయింది. తెదేపాను జాతీయపార్టీగా మలచాలని కలలుగన్న చంద్రబాబు నాయుడు, తెలంగాణాలో ఎంతో బలంగా తెదేపాని కేసీఆర్ ఈ విధంగా క్రమంగా నిర్వీర్యం చేస్తుంటే ఏమాత్రం పట్టించుకోకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణాలో బలంగా ఉన్న తన పార్టీనే కాపాడుకోలేనప్పుడు, అసలు పార్టీ ఉనికేలేని మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలకు తన పార్టీని ఏవిధంగా విస్తరించగలరు? అనే సందేహం కలగడం సహజమే. చంద్రబాబు నాయుడు ఇదే వైఖరిని ఇక ముందు కూడా కొనసాగించినట్లయితే జి.హెచ్.ఎం.సి.ఎన్నికలలో తెదేపా ఘోరపరాభం పొందడం తధ్యం. దానితోనే తెలంగాణాలో తెదేపా పతనం ఆరంభమవవచ్చును.