‘‘కేవీ రెడ్డి, బీయన్ రెడ్డి అవార్డులు ఇవ్వడం కొంత కాలం ఆపేయమని ఓ సందర్భంలో నిర్వాహకులకు సూచించాను. ఎందుకంటే మన దగ్గర దర్శకులు ఉన్నారు గానీ గొప్ప సినిమాలు తీస్తున్నవాళ్లు అరుదుగానే ఉన్నారు. వారిలో గుణశేఖర్ ఒకరు. అతనికి ఈ అవార్డు ఇవ్వడం ఎంతో సమంజసం’’ అని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. మూడు దశాబ్దాలుగా ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి పేరు మీద యువకళావాహిని ఇస్తున్న ‘కేవీ రెడ్డి’ అవార్డును దాసరి నారాయణరావు చేతుల మీదుగా గుణశేఖర్ అందుకున్నారు. ఆదివారం ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ వేడుకలో దాసరి మాట్లాడుతూ- ‘‘గుణశేఖర్ గొప్ప క్రియేటర్. అతను తీసిన ‘సొగసు చూడ తరమా’ సినిమా చూసి సిగ్గుపడ్డా. అంత గొప్పగా తీశాడు.రాజీపడడం తనకు తెలియదు. అతను అనుకున్న దారిలో సక్సెస్ అవుతూ వచ్చాడు. అతని జీవితం ఒక ఎత్తయితే, ‘రుద్రమదేవి’ మరొక ఎత్తు. గుణశేఖర్ ఇంకా గొప్ప సినిమాలు తీయాలని ఆశిస్తున్నా’’ అని అన్నారు.
గుణ శేఖర్ మాట్లాడుతూ -‘‘దర్శకుడు కేవీ రెడ్డిగారి ప్రభావం ఈ తరం దర్శకుల మీద చాలా ఉంది. దర్శకులు నిర్మాతలుగా మారితే వారి అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు తీస్తారని దాసరిగారు తన ‘శివరంజని’ చిత్రం ద్వారా నిరూపించారు. అలాంటి దర్శకుని చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో దాసరిగారి పేరు మీద అవార్డు స్థాపిస్తే కచ్చితంగా దాని కోసం పోటీపడతాను’’ అని చెప్పారు. సారిపల్లి కొండలరావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో నిర్మాతలు రమేశ్‌ప్రసాద్, అశ్వినీదత్, రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, హరనాథ్‌రావు, దివాకర్‌బాబు, తోటప్రసాద్, సంగీత దర్శకుడు మణిశర్మ,నారాయణరావు తదితరులు పాల్గొన్నారు