ఇదివరకు ఓటుకి నోటు కేసులో తెదేపా ప్రభుత్వం ఎంతగా అప్రదిష్టపాలయిందో మళ్ళీ కాల్ మనీ వ్యవహారంలో కూడా అంతే అప్రదిష్ట మూటగట్టుకొంటోందిపుడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా విజయవాడలోనే ఉంటునప్పటికీ ఇటువంటి నేరాలు జరుగుతుండటం, అధికార పార్టీకి చెందిన వారి పేర్లే ఈ వ్యవహారంలో ఎక్కువగా వినిపిస్తుండటంతో ప్రభుత్వం అండదండలతోనే ఆ నేరాలు జరుగుతున్నాయనే వైకాపా ఆరోపణలకు బలం చేకూరుతోంది.
ప్రత్యేక హోదా అంశంపై పోరాటాలు విఫలమయిన తరువాత చాలా డీలా పడిపోయున్న వైకాపాకు తెదేపా నేతలే ఈ కాల్ మనీ అనే బలమయిన అస్త్రం అందించారు. జగన్మోహన్ రెడ్డి క్షణం ఆలస్యం చేయకుండా దానిని అందిపుచ్చుకొని ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై యుద్ధం ప్రకటించేశారు. కాల్ మనీ వ్యవహారంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఉదాసీనతను ఎండగడుతూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బహిరంగ లేఖ వ్రాసారు. కనీసం ఇప్పటికయినా ఈ వ్యవహారంలో దోషులందరినీ కటినంగా శిక్షించి, భాదితులకు పూర్తి న్యాయం చేయాలని తన లేఖలో కోరారు. వైకాపా నేతలు ప్రభుత్వంపై తమ దాడిని మరింత తీవ్రం చేయవచ్చును.
ఈ వ్యవహారంలో పార్టీ, ప్రభుత్వ పరువు కాపాడుకొనేందుకయినా ముఖ్యమంత్రి తన పార్టీ నేతల మీద చర్యలు తీసుకోవలసిన ఆగత్యం కలిగింది. అంత వరకు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే ఉండవచ్చును. ఇటువంటి విషయాలలో అది చాలా అవసరం కూడా. ఈ వ్యవహారంలో ఇంకా ఎంత మంది అధికార పార్టీ నేతల పేర్లు బయటపడుతాయో తెలియదు. ఎన్ని పేర్లు బయటపడితే పార్టీకి ఇంకా అంత అప్రదిష్ట. ప్రతిపక్షాల ఒత్తిడికి లొంగి తమ నేతలపైనే చర్యలు తీసుకోవడం మొదలుపెడితే తెదేపా తన వేలితోనే తన కళ్ళు పొడుచుకొన్నట్లవుతుంది. అలాగని ఉపేక్షిస్తే ప్రతిపక్ష పార్టీలు ఊరుకోవు. దోషులను ప్రభుత్వమే కాపాడుతోందని మరింత గట్టిగా ప్రచారం చేయవచ్చును. ఈ కాల్ మనీ వ్యవహారం తెదేపాకు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కటినంగా వ్యవహరించినా, వ్యవహరించకపోయినా కూడా పార్టీకే తీవ్ర నష్టం జరుగుతుంది. అయితే సాధారణంగా ఇటువంటి క్లిష్టమయిన పరిస్థితులు ఎదురయినప్పుడు రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు వాటిని అధిగమించడానికి వేరొక అంశం లేదా సమస్య మీదకు ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నాలు చేస్తుంటాయి. కనుక ఈ కాల్ మనీ వ్యవహారంలో నుండి బయటపడేందుకు తెదేపా కూడా అటువంటి ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు. అప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఈ సమస్యకూడా టీకప్పులో తుఫానులాగ మాయమైపోవచ్చును.