కల్తీ మద్యం కేసులో నిందితుడుగా పేర్కొనబడిన విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లాది విష్ణు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న కాల్ మనీ వ్యవహారంలో కూడా ఆయన అనుచరుడి పేరు బయటపడింది. కనుక ఈ అనైతిక వ్యవహారంలో కూడా ఆయన పాలుపంచుకొన్నారా లేదా అనే విషయం ఆయన పోలీసులకి చిక్కితే కానీ బయటపడే అవకాశం లేదు. ఆయన అనుచరుడు గణేష్ విజయవాడలోని ఒక మహిళకు లక్ష రూపాయలు అప్పు ఇచ్చి అందుకు వడ్డీగా నాలుగు లక్షల వడ్డీ గుంజుకోవడమే కాకుండా ఆమె ఇంటిని కూడా బలవంతంగా స్వాధీనం చేసుకొన్నట్లు పోలీసులకు పిర్యాదు అందింది. అప్పుడే మల్లాది విష్ణు పేరు కూడా వినపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని గణేష్ కోసం గాలిస్తున్నారు. మల్లాది విష్ణు హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం అందుకొన్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆయన కోసం గాలిస్తున్నారు. ఆయన ఓడిషాకు పారిపోయినట్లు మరో సమాచారం అందడంతో మరో పోలీస్ బృందం అక్కడికి కూడా వెళ్లి ఆయన కోసం గాలిస్తోంది.