అమరావతి శంఖు స్థాపన కార్యక్రమం జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య స్నేహం ఏర్పడింది. ఈరోజు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా విజయవాడ వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తను చేయబోయే ఆయుత చండీ యాగానికి ఆహ్వానించడంతో వారి స్నేహబంధం మరింత బలపడింది. ఇదివరకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆజన్మ శత్రువులలాగ పోరాడుకొంటునపుడు, ఎప్పటికయినా ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుందా రాదా అనే అనుమానాలు కలిగేవి. గవర్నర్ నరసింహన్ స్వయంగా చొరవ తీసుకొని వారిరువురినీ కలిపేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. ముఖ్యమంత్రులిద్దరూ ఒకరికొకరు సహకరించుకొంటూ రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవాలని చాలా మంది సూచించారు. కానీ ఓటుకి నోటు కేసుతో వారి మధ్య దాదాపు యుద్ద వాతావరణం ఏర్పడింది. కానీ ఎవరూ ఊహించని విధంగా బద్ధ శతృవులయిన వారిరువురు మధ్య స్నేహం చిగురించింది. తత్ఫలితంగా ఇప్పుడు రెండు ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం కూడా బాగా తగ్గిపోయింది. కానీ వారి స్నేహం వలన కేసీఆర్ మాత్రమే పూర్తిగా లాభపడుతుంటే, చంద్రబాబు నాయుడు ఎక్కువ నష్టపోతున్నట్లు స్పష్టంగా కనబడుతోంది.
కేసీఆర్ తో తన స్నేహం నిలుపుకోవడం కోసం చంద్రబాబు నాయుడు వరంగల్ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో కలుగజేసుకోలేదు. కేవలం అందుకే జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో కూడా కలుగజేసుకోకూడదని భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు తమ స్నేహానికి ఇంత ప్రాధాన్యతనిస్తుంటే, కేసీఆర్ దానికి ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఎన్నికలలో తెదేపా ఎంపిటీసిలను తెరాసలోకి చేర్చుకొన్నారు. అలాగే ఇటీవల తెదేపా ఎమ్మెల్యే సాయన్నను కూడా తెరాసలో చేర్చుకొన్నారు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇంకా చాలా మంది తెదేపా నేతలను తెరాసలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు తెలంగాణాలో తెదేపాను నిర్వీర్యం చేస్తూనే మళ్ళీ ఏమీ ఎరుగనట్లుగా చంద్రబాబు నాయుడుని ఆహ్వానించేందుకు ఈరోజు విజయవాడ వచ్చేరు. కేసీఆర్ తెలంగాణాలో తెదేపాను పూర్తిగా తుడిచిపెట్టే ప్రయత్నాలు చేస్తుండటం కళ్ళారా చూస్తున్నపటికీ చంద్రబాబు నాయుడు కేసీఆర్ ని సాదరంగా ఆహ్వానించి ఆంధ్రా స్పెషల్ వంటకాలను కొసరి కొసరి తినిపించి సాగనంపారు.
చంద్రబాబు నాయుడు తమ స్నేహం నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నపటికీ, కేసీఆర్ దానికి ఏమాత్రం విలువ ఇవ్వడం లేదు. చప్పట్లు ఎప్పుడూ ఒంటి చేత్తో ఎలాగ మోగవో అలాగే స్నేహం కూడా కేవలం ఒకవైపు నుంచే కొనసాగించడం సాధ్యం కాదు. ఇరువురు ముఖ్యమంత్రులు సఖ్యతగా ఉంటూ రెండు తెలుగు రాష్ట్రాలను పోటీపడి అభివృద్ధి చేయాలనే ప్రజలు కూడా కోరుకొంటున్నారు. కానీ ఆ సఖ్యత కోసం చంద్రబాబు నాయుడు మరీ అంత బారీ మూల్యం చెలించవలసిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో కేసీఆర్ పూర్తిగా లాభపడుతుంటే చంద్రబాబు నాయుడు చాలా బారీ మూల్యం చెల్లిస్తున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. తెదేపాను జాతీయపార్టీగా ఇరుగుపొరుగు రాష్ట్రాలకు విస్తరించాలని ఆలోచిస్తునప్పుడు తెలంగాణాలో తెదేపాను మరింత బలోపేతం చేసుకొనే ప్రయత్నాలు చేయకుండా, పార్టీని బలహీన పరుస్తున్న కేసీఆర్ తో స్నేహం ఎందుకు?అని తెలంగాణా తెదేపా నేతలే మధనపడుతున్నారని సమాచారం. కనుక చంద్రబాబు నాయుడు తమ స్నేహం ఖరీదు తెలంగాణాలో తన పార్టీ కాకుండా జాగ్రత్త పడితే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.