కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజకీయ పరిపక్వత ఎప్పుడు సాధిస్తారో ఎవరికీ అంతుపట్టకుండా ఉంది. రెండు నెలల రహస్య విదేశీ యాత్రలో విపాసన యోగా చేశారని వార్తలు వచ్చాయి. ఎలాంటి యోగా చేశారో గానీ ఆయన మాట్లాడే తీరు దారుణంగా ఉంటోంది. మంగళవారం నాడు ఒకే రోజు రెండు విషయాల్లో తన అజ్జానాన్ని బయటపెట్టుకున్నారు.
ఢిల్లీలోని షకూర్ బస్తీలో ఆదివారం అర్ధరాత్రి రైల్వే అధికారులు గుడిసెలను తొలగించారు. కబ్జాల పేరుతో బస్తీల మీద పడి అమానుషంగా ప్రవర్తించారు. ఇళ్లలోని సామగ్రిని బయట పడేశారు. గిన్నెల్లోని వంటకాలను కూడా విసిరేశారు. గుడిసెలను, పూరిళ్లను నేలమట్టం చేశారు. ఎముకలు కొరికే చలిలో బాధితులు వణికి పోయారు. ఈ ఘటనలో ఓ బాలిక మరణించిందని స్థానికులు చెప్పారు.
ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన ప్రదర్శన చేసింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ఎందుకు నిరసన తెలిపిందంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ కూల్చివేతలకు పాల్పడింది కేజ్రీవాల్ సర్కారే కదా అనే ధోరణిలో ఆయన మాట్లాడారు. దీనికి కేజ్రీవాల్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రాహుల్ ఇంకా బచ్చాలాగే మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రైల్వే శాఖ కేంద్ర పరిధికి వస్తుందని, తమ పరిధిలోకి రాదనే విషయం ఆయనకు తెలియక పోవడం ఆశ్చర్యమన్నారు. కనీసం కాంగ్రెస్ నాయకులైనా ఆయనకు ఈ విషయం చెప్పాల్సిందని వ్యాఖ్యానించారు.
ప్రతి విషయానికీ ప్రధాని నరేంద్ర మోడీపై ఆరోపణలు చేయడం రాహుల్ గాంధీకి బాగా అలవాటైంది. మోడీ మంగళవారం కేరళలో పర్యటించారు. అక్కడ ఓ హిందూ సంస్థ వారు మోడీని ఓ కార్యక్రమానికి ఆహ్వానించారు. దీనికి కేరళ సీఎం ఊమెన్ చాందీని నిర్వాహకులు ఆహ్వానించలేదు. అది ప్రభుత్వ కార్యక్రమం కాదు. నిర్వాహకులు ఎవరిని ఆహ్వానించాలో వారిష్టం. దానితో మోడీకి సంబంధం లేదు. అయినా, రాహుల్ గాంధీ గంభీర వదనంతో మోడీపై ఆరోపణలు చేశారు. ఈ దేశ ప్రధాన మంత్రి కేరళ ముఖ్యమంత్రిని అవమానించారంటూ విమర్శించారు. చుట్టూ కేరళకు చెందిన శశిథరూర్ తదితర నాయకులున్నారు. ప్రయివేట్ సంస్థ వారు ఎవరిని పిలవాలో వాళ్ల ఇష్టం, ప్రధానికి సంబంధం లేదని వారు కూడా చెప్పకుండా రాహుల్ మాటలకు నవ్వుతూ తలూపి తమ ప్రభు భక్తిని చాటుకున్నారు. కాంగ్రెస్ కు రేపటి అధ్యక్షుడిగా, కాబోయే ప్రధాన మంత్రిగా అనుచరులు, వందిమాగధులు ప్రతిదాన్నీ సమర్థించడంతో ఆయన మరింత తిరోగమన దిశలో ఆలోచిస్తున్నారు. ఇలాగైతే పార్టీని ఎలా నడుపుతారో అనేది కాంగ్రెస్ వారు ఆలోచించాల్సిన విషయం. ఆ సంగతి మనకెందుకు?