ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి సమస్య తలెత్తినా ప్రభుత్వం కంటే ముందు…ప్రభుత్వం కంటే ఎక్కువగా స్పందిస్తుంటారు వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నారు కనుక అది సహజమే అనుకోవచ్చును. కాల్ మనీ వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని తీవ్రంగా విమర్శిస్తూ జగన్ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక బహిరంగ లేఖ వ్రాసారు. అందరూ ఊహిస్తునట్లే నేడు జగన్ తన పార్టీ నేతలను వెంటబెట్టుకొని గవర్నర్ నరసింహన్ని కలవబోతున్నారు. కాల్ మనీ, బాక్సైట్ తవ్వకాలు, కల్తీ మద్యం వ్యవహారాల గురించి ప్రభుత్వంపై ఆయన గవర్నర్ కి పిర్యాదు చేయబోతున్నారు. బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయమని ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా కోరనున్నారు. అలాగే కల్తీ మద్యం, కాల్ మనీ వ్యవహారాలలో ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరించి బాద్యులపై కటిన చర్యలు తీసుకొనేలా ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా కోరనున్నారు.
ఇటువంటి సమస్యలపై స్పందించవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపాపై ఉంది కనుక జగన్మోహన్ రెడ్డి తక్షణమే స్పందిస్తున్నారు. కల్తీ మద్యం కేసులో ఐదుగురు మరణించినపుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మద్యనిషేధం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఒకవేళ ప్రభుత్వం ఆ పని చేయలేకపోతే తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తుందని ప్రకటించారు. కానీ తమ పార్టీలోనే మద్యం వ్యాపారాలు చేసే నేతలు చాలా మంది ఉండటంతో ఇప్పుడు ఆ విషయం గురించి జగన్ గట్టిగా మాట్లాడకపోవడం గమనించవచ్చును.
మద్యపానం వలన రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతున్నప్పటికీ దాని గురించి గట్టిగా మాట్లాడినట్లయితే ముందుగా తన పార్టీ నేతలకే ఇబ్బంది కలుగుతుందని ఆయన మౌనం వహిస్తున్నారని, కానీ అదే అధికార తెదేపాని దెబ్బ తీయగల సమస్యలపై మాత్రం పోరాడుతున్నారని స్పష్టం అవుతోంది. అంటే ఆయన చేస్తున్న పోరాటాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసమా…లేక తన పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమా? అనే అనుమానం కలుగుతోంది. కల్తీ మద్యం కేసులో మృతుల పట్ల జగన్మోహన్ రెడ్డికి నిజంగా సానుభూతి ఉన్నట్లయితే, ఈరోజు గవర్నరును కలిసినపుడు ఆ వ్యవహారంపై కేవలం పిర్యాదు చేసి ఊరుకోకుండా రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలుచేయమని కోరి అందుకోసం తమ పార్టీ కూడా సహకరిస్తుందని హామీ ఇస్తే అందరూ హర్షిస్తారు. అలాగే మద్యపాన నిషేధం గురించి మాట్లాడేముందు తమ పార్టీలో మద్యం వ్యాపారాలు చేస్తున్నవారి పట్ల తమ పార్టీ ఏవిధంగా వ్యవహరించబోతోందో స్పష్టం చేస్తే ఇంకా బాగుంటుంది.