హైదరాబాద్: కాల్‌మనీ వ్యాపారులపై, అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిన్న కలెక్టర్లకు, పోలీస్ ఉన్నతాధికారులకు ఖరాఖండిగా చెప్పటంతో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా కాల్‌మనీ వ్యాపారులు, అక్రమ వడ్డీ వ్యాపారులపై దాడులు జరుగుతున్నాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, కడప జిల్లాలలో పోలీసులు ఈ దాడులను నిర్వహిస్తున్నారు. విజయవాడ చిట్టినగర్, మాచవరంలో ఇవాళ దాడులు జరిపారు… టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సోదరుడు నాగేశ్వరరావును, గుర్రం కొండ అనే మరో కాల్ మనీ వ్యాపారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం, కందుకూరు, చీరాల పట్టణాలలో, తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో, కడపజిల్లా పొద్దుటూరు, పులివెందుల, రాయచోటి పట్టణాలలో, గుంటూరు జిల్లా శారదాకాలనీలో కూడా ఈ దాడులు జరిగాయి. వడ్డీ వ్యాపారుల ఇళ్ళు, కార్యాలయాల నుంచి డాక్యుమెంట్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ పరిణామంతో వడ్డీ వ్యాపారులు షాక్‌కు గురయ్యారు.